Future Water Wars: ప్రపంచాన్ని శాసించబోతున్న బ్లూడైమండ్‌... ఊహించని యుద్ధాలు జరగొచ్చు

రాబోయే రోజుల్లో నీటికోసం ప్రపంచ దేశాల మధ్య భారీగా యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే నిశ్శబ్ధ యుద్ధం మొదలైంది.

Balachander
Published on: 9 Jun 2026 11:41 AM IST
Future Water Wars: ప్రపంచాన్ని శాసించబోతున్న బ్లూడైమండ్‌... ఊహించని యుద్ధాలు జరగొచ్చు
X

Future Water Wars: ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న ఆయుధ యుద్ధాలపైనే ఉంది. కానీ, రాబోయే రోజుల్లో తుపాకులు, క్షిపణుల కంటే అత్యంత భయంకరమైన యుద్ధం ఒకటి రాబోతోంది. అదే "బ్లూ డైమండ్" (నీరు) కోసం జరిగే యుద్ధం. భూమిపై కేవలం ఒక శాతం మాత్రమే తాగడానికి వీలైన స్వచ్ఛమైన నీరు ఉంది. ఈ తక్కువ వనరును తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రపంచ దేశాల మధ్య ఇప్పటికే నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. ఏ దేశాలైతే తమ నీటి వనరులను కాపాడుకుంటాయో, అవే భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

నీటి సామ్రాజ్యాలు: ఎవరి దగ్గర ఎంత ఉంది?

ప్రపంచంలోనే అత్యధికంగా స్వచ్ఛమైన నీటి వనరులు కలిగిన టాప్ 5 దేశాలలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, కెనడా, చైనా, అమెరికాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచ జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న భారతదేశంలో కేవలం 4 శాతం మాత్రమే తాగునీటి వనరులు ఉన్నాయి. ఈ అసమతుల్యతే రేపటి ముప్పుకు మూలకారణం. అయితే, ఈ నీటివనరులను అడ్డుపెట్టుకొని రష్యా, చైనా, అమెరికాలు ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే అవకాశం లేకపోలేదు.

చరిత్ర చెప్తున్న సత్యం

నీటి కోసం యుద్ధాలు జరగడం కొత్తేమీ కాదు. గడిచిన 50 ఏళ్లలో నీటి వివాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 37కి పైగా యుద్ధాలు జరిగాయి. 2006 నుండి 2011 మధ్య సిరియాలో వచ్చిన తీవ్రమైన కరవు వల్ల లక్షలాది మంది ప్రజలు నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇది అక్కడి రాజకీయ అస్థిరతకు, ఆ తర్వాత జరిగిన భీకర యుద్ధానికి దారితీసింది. ఆఫ్రికాలో నైలు నదిపై ఇథియోపియా నిర్మిస్తున్న భారీ డ్యామ్ కారణంగా ఈజిప్ట్, సూడాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆఫ్రికాకు నైలునది జీవనాడి. ఈ నదిపై చెక్‌డ్యామ్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఆఫ్రికాలో ఈ నదిపై దేశాలు ఆధారపడి ఉండటమే దీనికి కారణం. కానీ, ఇప్పుడు ఇథియోపియా భారీ డ్యామ్‌ నిర్మిస్తుండటంతో దేశాల మధ్య అంతర్యుద్ధం తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు భూమి కోసం, చమురు కోసం జరిగాయి. కానీ 2030 దాటిన తర్వాత జరిగే ప్రపంచ యుద్ధం కేవలం "నీటి చుక్క" కోసమే జరుగుతుందని అంతర్జాతీయ వ్యూహకర్తలు బలంగా హెచ్చరిస్తున్నారు.

చైనా ఇప్పటికే టిబెట్ ప్రాంతంలోని నదులపై డ్యాములు నిర్మిస్తూ భారతదేశం, బంగ్లాదేశ్‌లకు వచ్చే నీటిని నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. నీటిని కేవలం ఒక వనరుగా కాకుండా, ఒక వ్యూహాత్మక ఆయుధంగా దేశాలు వాడుకుంటున్నాయి. అందుకే, భవిష్యత్తులో ఆయుధాలు ఉన్న దేశం కాదు, స్వచ్ఛమైన నీరు ఉన్న దేశమే నిజమైన సూపర్ పవర్. ఇప్పటికైనా నీటిని వృథా చేయడం ఆపకపోతే, రేపటి తరం తాగే నీటి కోసం రక్తం చిందించాల్సి వస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story