US - Cuba: క్యూబా విముక్తి కోసం బ్రెజిల్‌ పోరాటం.. అమెరికా ఆటలు ఇక సాగవ్‌

US - Cuba: ఎన్నో దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తూ వస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు వెల్లువెత్తినా పడమటి దేశం దిగిరాలేదు.

Balachander
Published on: 20 April 2026 10:10 AM IST
US - Cuba
X

US - Cuba: క్యూబా విముక్తి కోసం బ్రెజిల్‌ పోరాటం.. అమెరికా ఆటలు ఇక సాగవ్‌

Brazil Calls for Cuba’s Freedom: ఎన్నో దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తూ వస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలు వెల్లువెత్తినా పడమటి దేశం దిగిరాలేదు. పైగా ఆంక్షలు మరింత కఠినం చేసింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డ సిల్వా క్యూబా తరపున గళమెత్తారు. క్యూబా విముక్తి కోసం ఆయన చేస్తున్న పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

ప్రపంచ పటంలో ఒక చిన్న ద్వీప దేశం క్యూబా. కానీ ఆ దేశం గత 60 ఏళ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలు మాత్రం వర్ణనాతీతం. అమెరికా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఆ దేశం ఊపిరి సలపక విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

నరకప్రాయమైన ఆంక్షలు.. అంతం కావాలి!

అమెరికా క్యూబాపై కఠినమైన వైఖరిని అవలంభిస్తోంది. నరకప్రాయమైన ఆంక్షల కారణంగా ఆదేశ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. క్యూబాపై విధిస్తున్న నరకప్రాయమైన ఆంక్షలను వెంటనే నిలిపివేయాలి. క్యూబా ప్రజలను వారి ఇష్టప్రకారం జీవించేలా చేయాలి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఐక్యరాజ్య సమితి వేదికలను సైతం ఆలోచింపజేస్తోంది. ఒక చిన్న దేశం తన సొంత సిద్ధాంతాలతో బ్రతకాలనుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అమెరికా పెత్తనం ఇక సాగదని, క్యూబా ప్రజల అంతర్గత విషయాల్లో వేలు పెట్టే హక్కు ఏ దేశానికీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

6 దశాబ్దాల అణచివేత.. చెక్కుచెదరని ధైర్యం

1960 ప్రాంతం నుండి క్యూబాపై అమెరికా ఆర్థిక దిగ్బంధం విధిస్తోంది. దీనివల్ల క్యూబాకు అవసరమైన మందులు, ఆహారం, కనీస వస్తువుల సరఫరా కూడా నిలిచిపోయింది. అయినప్పటికీ, క్యూబా ప్రజలు తలవంచలేదు. వారి పోరాట పటిమను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. లులా మాటల్లో చెప్పాలంటే, ఇది కేవలం రాజకీయ విభేదం కాదు, ఇది ఒక దేశంపై జరుగుతున్న క్రూరత్వం. ఈ క్రూరత్వంపై ఇప్పటికైనా తిరగబడాలని, క్యూబా స్వేచ్చకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మానవత్వం కోసం ఒక పిలుపు

క్యూబా సమస్యను ఎట్టిపరిస్థితుల్లో రాజకీయకోణంలో చూడకూడదని, అక్కడ నివశిస్తున్న ప్రజలు మనలాంటి సామాన్యులేనని, వారికి కూడా ప్రపంచంతో కలిసి నడిచే, జీవించే హక్కు ఉంటుందని బ్రెజిల్‌ అధ్యక్షుడు పేర్కొన్నాడు. "నిజం నిప్పులాంటిది.. అది ఎప్పటికైనా బయటపడుతుంది" అన్న సామెతను గుర్తు చేస్తూ, క్యూబా స్వేచ్ఛ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని లులా పిలుపునిచ్చారు.

మొత్తంగా చూసుకుంటే.. లులా డిమాండ్ వెనుక బలమైన ప్రజా గొంతుక ఉంది. అగ్రరాజ్యాల అహకారానికి బలైపోతున్న చిన్న దేశాలకు మద్దతుగా బ్రెజిల్ నిలబడటం గొప్ప పరిణామం. ఆంక్షల సంకెళ్లు తెగిపోయి, క్యూబా ప్రజలు స్వేచ్ఛగా శ్వాసించే రోజు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ పోరాటం కేవలం క్యూబా కోసం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల సమానత్వం కోసం అని కూడా మనం ఆలోచించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story