BRICS Foreign Minister Summit: ఒక్కసారిగా మారిన ప్రపంచం దృష్టి...భారత్‌లో బ్రిక్స్‌ - చైనాలో ట్రంప్‌

ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత ఒకేసారి చర్చకు వస్తున్న అరుదైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.

Balachander
Published on: 14 May 2026 11:33 AM IST
BRICS Foreign Minister Summit: ఒక్కసారిగా మారిన ప్రపంచం దృష్టి...భారత్‌లో బ్రిక్స్‌ - చైనాలో ట్రంప్‌
X

BRICS Foreign Minister Summit: ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత ఒకేసారి చర్చకు వస్తున్న అరుదైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో భేటీ అవుతుండగా, మరోవైపు భారత్ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ రెండు పరిణామాలు ఒకేసారి జరగడం ప్రపంచ దృష్టిని ఆసియాపై కేంద్రీకరించింది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించనుంది.

ఏమిటీ బ్రిక్స్? ఎందుకు ప్రాధాన్యత?

బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల కూటమి. అయితే 2025 నాటికి ఈ కూటమి మరింత విస్తరించింది. ఈ బ్రిక్స్‌ కూటమిలో ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యూఏఈ, ఇండోనేషియా దేశాలు కూడా భాగమయ్యాయి. పాశ్చత్య దేశాల ఆధిపత్యం లేని ఒక కొత్త ఆర్థిక, రాజకీయ వ్యవస్థను నిర్మించడమే ఈ కూటమి లక్ష్యం. ఈ దిశగానే ఇప్పటి వరకు సదస్సులు జరుగుతూ వచ్చాయి. నిర్ణయించుకున్న లక్ష్యాలను పూర్తిచేస్తూ వచ్చాయి. అయితే, పశ్చిమాసియా సంక్షోభం సమయంలో జరుగుతున్న బ్రిక్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కారణం ఇందులో ఇరాన్‌ కూడా భాగస్వామ్యం కావడమే.

ఢిల్లీ ఎజెండా ఏమిటి?

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా బ్రిక్‌ దేశాల విదేశాంగ మంత్రులు హాజరవుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధి మూతపడటంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇది భారత్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోదీ సేవా తీర్థ నుంచి బ్రిక్‌ దేశాల నాయకులతో నేరుగా చర్చలు జరపనున్నారు.

ట్రంప్ - షీ జిన్‌పింగ్ భేటీ - అసలు వ్యూహం ఏమిటి?

ఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సుకు బ్రిక్‌ దేశాల విదేశాంగ శాఖ మంత్రులంతా హాజరవుతున్నా... చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ ఈ భేటీకి హాజరు కాలేదు. కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బీజింగ్‌లో పర్యటిస్తుండటమే. చైనాలో పర్యటిస్తున్న ట్రంప్‌ జీ జిన్‌పింగ్‌ని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడారు. మనం బాగా కలిసిపోయాం...ఇబ్బందులు వచ్చినపుడు వాటిని పరిష్కరించుకుంటాం. అద్భుతమైన భవిష్యత్తును పొందుతున్నామని ట్వీట్‌ చేశాడు. ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం ఇదేనని, అమెరికా దీనిని తప్ప మరే విషయం గురించి మాట్లాడుకోవడం లేదని చెప్పుకొచ్చారు. చైనా- అమెరికా మధ్య సంబంధం మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడబోతోంది. అని అన్నారు. అంతేకాదు, ఈ సమావేశంలో ఇరాన్ వైఖరిని మార్చాలని, చమురు సరఫరాను పునరుద్ధరించాలని ట్రంప్ చైనాను కోరే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా చైనా అమెరికా నుంచి తైవాన్ విషయంలో రాయితీలు ఆశించే అవకాశం కూడా ఉంది.

సామాన్యుడికి ఎందుకు ముఖ్యం?

ఈ అంతర్జాతీయ చర్చలు కేవలం మేధావులకే పరిమితం కాదు. అక్కడ జరిగే నిర్ణయాలే ఇక్కడ మన పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ప్రపంచ దేశాల మధ్య సఖ్యత కుదిరితేనే చమురు సంక్షోభం తీరుతుంది. భారత్ బ్రిక్‌ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల ఈ కూటమికి నేతృత్వం వహించడం ద్వారా ప్రపంచ శాంతి స్థాపనలో తన 'విశ్వగురు' ముద్రను చాటుకుంటోంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రెండు కీలక స్థాయి సదస్సులు జరుగుతుండటంతో ప్రపంచం దృష్టి యావత్తు వీటిపైనే నిమగ్నమైందని చెప్పొచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story