Emergency Alert: మూడు రోజుల పాటు తిండి, నీళ్లు నిల్వ చేసుకోండి.. బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరిక
Emergency Alert: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, పెరిగిపోతున్న సైబర్ దాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తన దేశ ప్రజలను అప్రమత్తం చేసింది.
British Government
Emergency Alert: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, పెరిగిపోతున్న సైబర్ దాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తన దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇళ్లలో కనీసం మూడు రోజులకు సరిపడే తాగునీరు, ఆహార పదార్థాలు అలాగే ఇతర అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచన చేసింది. దేశంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బ్లాక్ కావడం, సైబర్ ముప్పులు అలాగే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.
బి రెడీ క్యాంపెయిన్ వెనుక అసలు కారణాలు
ప్రభుత్వం ప్రారంభించిన బి రెడీ ఉద్యమం ద్వారా ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. శీతాకాలంలో వచ్చే భారీ తుఫానులు, వేసవిలో సంభవించే అడవి మంటల కారణంగా రోజూవారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతోంది. దీనికి తోడు శత్రు దేశాల నుంచి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలపై, ఆర్థిక రంగాలపై సైబర్ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఏటీఎంలు పనిచేయకపోయినా, సూపర్ మార్కెట్లలో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇంట్లో నిల్వ చేయాల్సిన వస్తువుల జాబితా
ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో కొన్ని కీలకమైన వస్తువులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి వ్యక్తికి రోజుకు 3 లీటర్ల చొప్పున మూడు రోజులకు 9 లీటర్ల తాగునీరు అందుబాటులో ఉండాలి. అలాగే త్వరగా చెడిపోని డబ్బాల్లో ఉండే ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, ప్రథమ చికిత్స కిట్లు, నిత్యం వాడే మందులు ఉంచుకోవాలి. దీనితో పాటు మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంకులు, టార్చ్ లైట్లు, తగినంత నగదు అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్ల కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
యూరప్ దేశాల బాటలో బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం
కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి యూరప్ దేశాలు కూడా గతంలో ఇలాంటి ఆపత్కాల సన్నాహాలను ప్రజలకు సూచించాయి. ఈ నిబంధనలు నేరుగా యుద్ధ ప్రకటన కానప్పటికీ, ఏ క్షణంలోనైనా సాంకేతిక లోపాలు లేదా విపత్తులు తలెత్తితే ప్రాణనష్టం జరగకుండా రక్షించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అత్యవసర సమయాల్లో సహాయక బస్గాలు వచ్చే వరకు ప్రజలు స్వయం సమృద్ధిగా జీవించడానికి ఈ ముందస్తు తయారీ ఎంతైనా అవసరమని అధికారులు వెల్లడించారు.




