British Swimmer: హోర్ముజ్ జలసంధిలో బ్రిటీష్ స్విమ్మర్ అద్భుతం ... బాంబులు పేలుతున్నా...
ఇరాన్ యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధిలో 15 కిలోమీటర్లు ఈత కొట్టిన బ్రిటిష్ స్విమ్మర్ లూయిస్ ప్యూ సాహసం, పేలుళ్లు, చమురు నౌకలపై దాడులు, సముద్ర జీవరాశులకు పొంచి ఉన్న ముప్పు గురించి తెలుసుకుందాం.
British Swimmer: యుద్ధం జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి ఈత కొట్టడమే ఒక సాహసం. అలాంటిది చుట్టుపక్కల పేలుళ్లు వినిపిస్తున్నా, చమురు నౌకలపై దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గకుండా తన లక్ష్యాన్ని పూర్తి చేశారు బ్రిటిష్ స్విమ్మర్ లూయిస్ ప్యూ. ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలోని సముద్ర జీవరాశులు, పర్యావరణానికి ఎదురవుతున్న ముప్పును ప్రపంచం దృష్టికి తీసుకురావడమే ఆయన ప్రయత్నం. ఐక్యరాజ్యసమితి సముద్రాల పరిరక్షణ కార్యక్రమానికి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ప్యూ.. మూడు రోజుల పాటు ఈ జలసంధిలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 కిలోమీటర్లు ఈదారు. 56 ఏళ్ల లూయిస్ ప్యూ ఈ సాహస యాత్రను సాధారణ క్రీడా కార్యక్రమంగా చేపట్టలేదు. యుద్ధం వల్ల సముద్రంలో చోటుచేసుకుంటున్న విధ్వంసం ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో చూపించాలనుకున్నారు. ముసందమ్ ద్వీపకల్పం నుంచి కేప్ ఆఫ్ హోర్ముజ్ వరకు ఆయన ఈత కొట్టారు. మొత్తం ఆరున్నర గంటల పాటు నీటిలో గడిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో ఇంత దూరం ఈత కొట్టేందుకు ప్రయత్నించిన తొలి వ్యక్తి ఆయనే అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈత ప్రారంభించిన కొద్దిసేపటికే పేలుళ్లు
నవంబర్ 16న సోమవారం నీటిలోకి దిగిన కొద్ది నిమిషాలకే రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చమురు నౌకపై దాడి జరిగినట్లు ప్యూ గుర్తించారు. కొద్దిసేపటికే యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలోకి రావడంతో ఆయన బృందం వెంటనే అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. పలుమార్లు విరామం తీసుకుంటూ చివరకు తన ఈతను పూర్తి చేశారు. రెండో రోజు కూడా ఆయనకు యుద్ధ భయానక పరిస్థితులు ఎదురయ్యాయి. ఓడరేవుకు తిరిగి వస్తున్న సమయంలో గ్యాస్ రవాణా నౌకపై దాడి జరగడాన్ని చూశారు. మంటలు ఆకాశంలోకి ఎగసిపడటం, నౌక చుట్టూ నీటిపై కూడా మంటలు కనిపించడం, రసాయనాల వాసన వ్యాపించడం ఆయనను కలవరపరిచాయి.
సముద్ర జీవరాశులకు దీర్ఘకాలిక ముప్పు
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గం మాత్రమే కాదు.. సముద్ర జీవవైవిధ్యానికి కూడా ఎంతో ముఖ్యమైన ప్రాంతం. దాడులకు గురైన నౌకల నుంచి చమురు సముద్రంలో కలిస్తే డాల్ఫిన్లు, తాబేళ్లు, పగడపు దిబ్బలు, మడ అడవులు తీవ్రంగా దెబ్బతింటాయని ప్యూ హెచ్చరించారు. కాలుష్యం ప్రభావం తగ్గడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈత యాత్రకు వెళ్లే సమయంలో తన పడవ వెంట పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు రావడాన్ని, తాబేళ్లు, ఓస్ప్రే పక్షులను చూడటాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. యుద్ధానికి ముందు ఒమన్ తీరంలో ఈత కొట్టినప్పుడు వందల సంఖ్యలో తాబేళ్లను చూశానని తెలిపారు. ఇప్పుడు అదే ప్రాంతంలోని జీవరాశులు ప్రమాదంలో పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ముందు ప్రపంచంలో వ్యాపారానికి తరలించే చమురులో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అయ్యేది. ఇటీవల ఈ మార్గంలో నౌకలపై దాడులు పెరిగాయని, అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయనే కారణంతో కొన్ని నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) నివేదించింది. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను తాకి కొన్ని ట్యాంకర్లు పేలిపోయి మంటల్లో చిక్కుకున్నాయి. గత నెలలో 20 లక్షలకు పైగా బ్యారెళ్ల చమురు తీసుకెళ్తున్న ఓ నౌక కూడా ప్రమాదానికి గురైంది.
సముద్రాల పరిరక్షణే లక్ష్యం
గత 40 ఏళ్లుగా లూయిస్ ప్యూ సముద్రాల పరిరక్షణ కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈత యాత్రలు చేపడుతున్నారు. ఉత్తర ధ్రువం మీదుగా ఈత కొట్టిన తొలి క్రీడాకారుడిగా, ప్రతి మహాసముద్రంలో సుదూర ఈత పూర్తి చేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. 2023లో హడ్సన్ నదిలో 315 మైళ్లు ఈత కొట్టి నదుల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఆయన ఫౌండేషన్ ప్రకారం, ఈ ప్రయత్నాల ద్వారా 35 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా సముద్ర ప్రాంతాల పరిరక్షణకు సంబంధించిన ఒప్పందాలు సాధ్యమయ్యాయి. క్రీడల ద్వారా రాజకీయ నాయకులు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించవచ్చని ప్యూ నమ్ముతున్నారు. హోర్ముజ్ యాత్ర ద్వారా ఆయన ఇచ్చిన సందేశం కూడా స్పష్టంగానే ఉంది. యుద్ధాన్ని ఆపాలి, జలసంధిని తిరిగి తెరవాలి, సముద్రంలో పేరుకుపోతున్న కాలుష్యాన్ని తొలగించాలి. ఎందుకంటే యుద్ధం ప్రభావం కేవలం మనుషులకే పరిమితం కాదు.. సముద్రంలో జీవించే ఎన్నో ప్రాణుల భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతుంది.




