China Mothership : ప్రపంచాన్ని భయపెడుతున్న చైనా మదర్‌షిప్ ప్లాన్... అసలు టార్గెట్ ఇదే
చైనా 670 అడుగుల భారీ మదర్‌షిప్‌ను నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నీటి అడుగు డ్రోన్ల కోసం రూపొందుతున్న ఈ నౌక ప్రత్యేకతలు, చైనా లక్ష్యంపై విశ్లేషణలను తెలుసుకుందాం.
China Mothership : చైనా సముద్రంలో తన సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందా? ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ఇదే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. షాంఘైలోని హుడాంగ్-జోంగ్‌హువా షిప్‌యార్డులో సుమారు 205 మీటర్లు.. అంటే 670 అడుగుల పొడవైన భారీ నౌక నిర్మిస్తున్నట్లు పలు మీడియా నివేదికలు వెల్లడించాయి. సాధారణ యుద్ధనౌకల మాదిరిగా కాకుండా.. నీటి అడుగున పనిచేసే భారీ మానవరహిత వాహనాలను సముద్రంలోకి పంపడం, తిరిగి తీసుకురావడం, వాటికి అవసరమైన సహాయాన్ని అందించడం ఈ నౌక ప్రధాన ఉద్దేశంగా ఉండొచ్చని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా విశ్లేషణలు వెలువడ్డాయి.
అసలు ఈ మదర్‌షిప్ ఎందుకు?
సాధారణంగా మానవరహిత అండర్‌వాటర్ వాహనాలు అంటే నీటి అడుగున మనుషులు లేకుండా పనిచేసే డ్రోన్లు. ఇవి సముద్ర పరిశోధన, నిఘా, సముద్ర భద్రత వంటి అనేక అవసరాలకు ఉపయోగపడతాయి. అయితే చైనా నిర్మిస్తోందని చెబుతున్న నౌక ప్రత్యేకత ఏమిటంటే.. ఇది చిన్న డ్రోన్ల కోసం మాత్రమే కాకుండా, సబ్‌మెరైన్ పరిమాణంలో ఉండే అత్యంత భారీ మానవరహిత అండర్‌వాటర్ వాహనాలను నిర్వహించగలిగేలా రూపొందుతున్నట్లు సమాచారం. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి ఈ నౌకను చైనా అభివృద్ధి చేస్తున్న కొత్త తరహా XXLUUVల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న మదర్‌షిప్‌గా అంచనా వేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. XXLUUV అంటే Extra-Extra-Large Uncrewed Underwater Vehicle. సింపుల్‌గా చెప్పాలంటే.. సాధారణ నీటి అడుగు డ్రోన్‌ల కంటే చాలా పెద్దగా ఉండే మానవరహిత వాహనాలు.
205 మీటర్ల పొడవు.. 27 మీటర్ల వెడల్పు
ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెలువడిన విశ్లేషణల ప్రకారం ఈ భారీ నౌక సుమారు 205 మీటర్ల పొడవు, 27 మీటర్ల వెడల్పు కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంత భారీ పరిమాణం ఉండటం వెనుక ప్రధాన కారణం.. పెద్ద అండర్‌వాటర్ వాహనాలను సముద్రంలోకి పంపేందుకు, తిరిగి నౌకపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయడమేనని భావిస్తున్నారు. ఈ నౌకలో వెట్ వెల్ డెక్ ఉండే అవకాశం ఉందని కూడా నివేదికలు చెబుతున్నాయి. నీటితో అనుసంధానమయ్యే ఈ ప్రత్యేక భాగం ద్వారా భారీ అండర్‌వాటర్ వాహనాలను సురక్షితంగా నీటిలోకి దించవచ్చు. వాటిని తిరిగి నౌకలోకి తీసుకురావడానికి కూడా ఇదే వ్యవస్థ ఉపయోగపడుతుంది.
12 జాక్‌అప్ ఆర్మ్స్.. నాలుగు భారీ డ్రోన్లు?
ఈ నౌకకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం 12 నిలువు జాక్‌అప్ ఆర్మ్స్ ఉండే అవకాశం. వీటి సాయంతో పెద్ద క్రేడిల్‌ను పైకి, కిందికి కదిలించి భారీ వాహనాలను సముద్రంలోకి దింపే విధంగా నిర్మాణం ఉండొచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అంతేకాదు.. నౌకలో ఒక ప్రత్యేక హ్యాంగర్ ఉండే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇందులో చైనా అభివృద్ధి చేస్తున్న అతిపెద్ద అండర్‌వాటర్ డ్రోన్లలో నాలుగు వరకు నిల్వ చేయగల సామర్థ్యం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. సముద్రంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా.. నౌకాశ్రయంలో ఉన్న సమయంలో కూడా ఈ వాహనాలను రక్షిత ప్రదేశంలో ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
చైనా అసలు లక్ష్యం ఏంటి?
ఇక్కడే ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ ఆసక్తి పెరుగుతోంది. భారీ మానవరహిత అండర్‌వాటర్ వాహనాలను ఒక ప్రత్యేక మదర్‌షిప్ ద్వారా సముద్రంలోని దూర ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రయోగించి, అవసరమైనప్పుడు తిరిగి తీసుకురాగలిగితే.. నీటి అడుగున సుదూర నిఘా, సముద్ర మార్గాల పర్యవేక్షణ, వివిధ రకాల సముద్ర కార్యకలాపాల్లో వాటి వినియోగానికి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా పెద్ద మానవ రహిత అండర్ వాటర్ వాహనాలను సాధారణ నౌకల నుంచి కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా ఉండొచ్చు. అలాంటి వాహనాల కోసం ప్రత్యేకంగా ఒక మదర్‌షిప్ ఉంటే.. వాటి ఆపరేషన్ పరిధి, సముద్రంలో ఉండే సమయం, నిర్వహణ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే ఈ నౌకను చైనా ఏ ప్రయోజనం కోసం నిర్మిస్తోందనే విషయంపై ఇప్పటివరకు బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. నావల్ న్యూస్‌తో పాటు ది టెలిగ్రాఫ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఉపగ్రహ చిత్రాలు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ నిర్మాణంపై కథనాలు ప్రచురించాయి. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన అనేక అంశాలు అంచనాల దశలోనే ఉన్నాయి. అయినప్పటికీ 205 మీటర్ల భారీ నౌకను పెద్ద మానవరహిత అండర్ వాటర్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లయితే.. భవిష్యత్తులో సముద్ర నిఘా, అండర్‌వాటర్ టెక్నాలజీ, నౌకాదళ కార్యకలాపాల్లో చైనా సామర్థ్యాన్ని పెంచే కీలక అడుగుగా ఇది మారే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఈ 670 అడుగుల ‘మదర్‌షిప్’ ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.




