Worlds Largest Dam : అరుణాచల్ సరిహద్దుల్లో చైనా కుట్ర.. ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ బాంబ్ డ్యామ్ నిర్మాణం షురూ

Worlds Largest Dam : అరుణాచల్ సరిహద్దుల్లో చైనా 60,000 మెగావాట్ల భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీనికి కౌంటర్‌గా భారత్ రూ. 1.50 లక్షల కోట్ల వ్యయంతో సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసింది.

CR Reddy
Published on: 21 Jun 2026 7:15 AM IST
Worlds Largest Dam
X

Worlds Largest Dam

Worlds Largest Dam : భారతదేశ సరిహద్దుల్లో నిరంతరం అలజడులు సృష్టించే చైనా.. ఇప్పుడు జలవనరులను ఆయుధంగా వాడుకోవడానికి సరికొత్త కుట్రకు తెరలేపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లుంగ్ త్సాంగ్పో నది దిగువ భాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు మేడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. దీని సామర్థ్యం అక్షరాలా 60,000 మెగావాట్లు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ భారీ డ్యామ్ మన దేశ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే నిర్మితమవుతోంది.

డ్రాగన్ డ్యామ్‌కు భారత్ మైండ్ బ్లాక్ కౌంటర్

చైనా చేస్తున్న ఈ జల కుట్రకు భారత్ అంతే వేగంగా, వ్యూహాత్మకంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్, సియాంగ్ జిల్లాల పరిధిలో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ (SUMP)ను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ (NHPC) ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా నిలుస్తుంది. దీని అంచనా వ్యయం సుమారు 13 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) కావడం విశేషం. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 47 బిలియన్ యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుంది.

రెండు దేశాల వేగం.. మన ముందున్న సవాళ్లు

ఈ రెండు ప్రాజెక్టులను నిశితంగా గమనిస్తే చైనా మనకంటే చాలా వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. చైనాకు చెందిన 60,000 మెగావాట్ల మేడోగ్ ప్రాజెక్ట్ పనులు క్షేత్రస్థాయిలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు, భారతదేశానికి చెందిన SUMP ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రారంభ అధ్యయనాలు, ప్రీ-ఫిజిబిలిటీ స్టేజ్‌లోనే ఉంది. దీనికి సంబంధించిన అసలైన భూమి పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. సామర్థ్యం పరంగా కూడా చైనా డ్యామ్ మన ప్రాజెక్ట్ కంటే చాలా పెద్దది కావడంతో, భారత్ ఇప్పుడు అంతర్జాతీయ నదీ జలాల నిబంధనల ప్రకారం చైనా కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతోంది.

బ్రహ్మపుత్ర నదికి పొంచి ఉన్న ముప్పు

టిబెట్‌లో ప్రవహించే యార్లుంగ్ త్సాంగ్పో నది.. భారతదేశంలోకి ప్రవేశించగానే సియాంగ్ నదిగా మారుతుంది. ఆ తర్వాత అస్సాంలోకి వెళ్లాక దీనినే బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని కోట్ల మంది ప్రజల తాగునీరు, సాగునీరు, జీవనోపాధికి ఈ నదే ప్రధాన ఆధారం. నది ఎగువ భాగంలో చైనా అంత పెద్ద డ్యామ్ కట్టడం వల్ల నదీ ప్రవాహ దిశ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, దిగువన ఉన్న భారతీయ ప్రాంతాలలో అకస్మాత్తుగా ఊహించని వరదలు వచ్చే ముప్పు ఉంది.

కేంద్ర ప్రభుత్వం పటిష్ట నిఘా

ఈ తీవ్రమైన సమస్యపై భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది. ఇటీవల లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో.. బ్రహ్మపుత్ర నది బేసిన్‌లో చైనా చేపడుతున్న అన్ని రకాల జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ నిశితంగా గమనిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. సరిహద్దు దాటి ప్రవహించే నదీ ప్రాజెక్టులలో పారదర్శకత ఉండాలని, డేటాను ఎప్పటికప్పుడు పంచుకోవాలని చైనాపై భారత్ దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. భారత్ నిర్మించబోయే సియాంగ్ ప్రాజెక్ట్ కేవలం కరెంట్ ఉత్పత్తి కోసమే కాకుండా.. చైనా ఒకేసారి నీటిని వదిలితే వచ్చే కృత్రిమ వరదలను అడ్డుకోవడానికి, నీటిని నిల్వ చేయడానికి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story