ఇంధనం అక్కర్లేదు.. 19 మంది ప్రయాణికులతో చైనా ఎలక్ట్రిక్ విమానం టేకాఫ్

China Electric Aircraft: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఏవియేషన్ రంగంలో చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'కోమాక్' (COMAC) అభివృద్ధి.

G Krishna
Published on: 15 Nov 2026 10:24 PM IST
China Electric Aircraft
X

ఇంధనం అక్కర్లేదు.. 19 మంది ప్రయాణికులతో చైనా ఎలక్ట్రిక్ విమానం టేకాఫ్

China Electric Aircraft: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఏవియేషన్ రంగంలో చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'కోమాక్' (COMAC) అభివృద్ధి చేసిన 19 సీట్ల ఎలక్ట్రిక్ ప్రయాణికుల విమానం తన తొలి మానవ సహిత (పైలటెడ్) పరీక్షా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. షాన్‌డాంగ్ ప్రొవిన్స్‌లోని బిన్జౌ వేదికగా నవంబర్ 14న ఈ చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. పది టన్నుల బరువు ఉండే ఈ విమానం గరిష్టంగా 19 మంది ప్రయాణికులను మోసుకెళ్లేలా, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా రూపొందించబడింది. ఈ పరీక్షా సమయంలో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్ సహా ముగ్గురు సిబ్బంది విమానంలో ఉన్నారు.

విజయవంతంగా ముగిసిన తొలి పరీక్షా యాత్ర

జిన్హువా వార్తా సంస్థ , చైనా ప్రభుత్వ టెలివిజన్ (CCTV) నివేదికల ప్రకారం.. ఈ విమానం తన తొలి ప్రయాణంలో అత్యంత సాధారణంగా పనిచేసిందని, అన్ని పనితీరు సూచికలు అంచనాలను అందుకున్నాయని వెల్లడించాయి. ఈ ఫ్లైట్ టెస్ట్ మొత్తం 57 నిమిషాల 46 సెకన్ల పాటు సాగగా, విమానం గాలిలో 16 నిమిషాల 38 సెకన్ల పాటు ప్రయాణించి మొత్తం 60.4 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. గతంలో ఫిబ్రవరి 2, 2026న ఈ విమానం ఎలాంటి పైలట్ లేకుండా తొలి మానవరహిత ఆటోమస్ (Autonomous) విమాన యాత్రను పూర్తి చేసింది. అలాగే దీని అభివృద్ధి దశలో భాగంగా దాదాపు 19 సార్లు మానవరహిత ఫ్లైట్-వాలిడేషన్ పరీక్షలను కూడా నిర్వహించారు.

ఎలా పనిచేస్తుంది ఈ CE-25A ఎలక్ట్రిక్ విమానం?

సాంప్రదాయ ప్రయాణికుల విమానాలలో వాడే ఇంధన ఆధారిత జెట్ లేదా టర్బోప్రెప్ ఇంజిన్‌లకు భిన్నంగా, ఈ CE-25A విమానం 'డిస్ట్రిబ్యూటెడ్ ఎలెక్ట్రిక్ డక్టెడ్-ఫ్యాన్ ప్రొపల్షన్ సిస్టమ్' (Distributed electric ducted-fan propulsion system) ఆధారంగా పనిచేస్తుంది. విమాన రెక్కల వెంబడి అమర్చిన బ్యాలెన్స్డ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్‌ల ద్వారా ఇది థ్రస్ట్ (ముందుకు నెట్టే శక్తి)ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఫ్యాన్‌లకు విమానంలోని బ్యాటరీ సిస్టమ్ ద్వారా శక్తి అందుతుంది. సాంప్రదాయ ఇంజిన్‌లకు బదులుగా ప్రొపల్షన్‌ను రెక్కల అంతటా విస్తరించడం ద్వారా విమాన రూపకల్పనలో వివిధ కాన్ఫిగరేషన్లను పరీక్షించడానికి ఇంజనీర్లకు ఇది వీలు కల్పిస్తోంది.

ప్రత్యేకతలు , భవిష్యత్ ప్రణాళికలు

ఈ విమానాన్ని కోమాక్ సంస్థ.. చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ CATL, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ , ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో అభివృద్ధి చేసింది. విమాన తయారీ రంగం, బ్యాటరీ టెక్నాలజీ, అకడమిక్ రీసెర్చ్‌లను సంయుక్తంగా జోడించి పెద్ద ఎలక్ట్రిక్ ప్రయాణికుల విమానాలను రూపొందించే దిశగా చైనా అడుగులు వేస్తోంది. జిన్హువా నివేదిక ప్రకారం.. ఈ విమానం గరిష్ట టేకాఫ్ బరువు 10 టన్నులు కాగా, దీని క్రూయిజింగ్ ఎత్తు 2,400 మీటర్లు. చైనాకు చెందిన CCAR-25 ట్రాన్స్‌పోర్ట్-కేటగిరీ ఎయిర్‌వర్తినెస్ నిబంధనల ప్రకారం దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAAC) వద్ద టైప్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారు దానిని అంగీకరించారు. తదుపరి పరీక్షలు పూర్తి చేసుకుని వాణిజ్య సేవల్లోకి ప్రవేశించడానికి ఈ విమానం సిద్ధమవుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.