China Nuclear Threat : చైనా నగరాలను జపాన్ టార్గెట్ చేస్తోందా? అణుముప్పుపై పీఎల్ఏ సంచలన రిపోర్ట్
చైనా ప్రధాన నగరాలపై క్షిపణి లేదా అణు దాడుల ముప్పు ఉందని పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ నివేదిక హెచ్చరించింది. జపాన్ను భద్రతా ముప్పుగా పేర్కొన్న కారణాలు, చైనా ముందస్తు సన్నాహాల గురించి తెలుసుకుందాం.
China Nuclear Threat : చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ సంచలనాత్మక పరిశోధనా నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ, భౌగోళిక వ్యూహాలు లేదా తీవ్రవాద ముఠాల కారణంగా తమ ప్రధాన నగరాలపై క్షిపణి లేదా అణు దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా జపాన్ను అంతర్జాతీయ భద్రతకు ఒక "ప్రధాన ప్రమాద సంకేతం"గా ఈ నివేదిక పేర్కొనడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
జపాన్‌పై చైనా ప్రధాన అనుమానాలు
జపాన్ చర్యలు అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని చైనా ఆర్మీ ఆరోపిస్తోంది. 2017 లో ఆమోదించిన 'అణు ఆయుధాల నిషేధ ఒప్పందం' పై జపాన్ ఇప్పటివరకు సంతకం చేయలేదని చైనా గుర్తుచేసింది. అంతేకాదు, అణు ఆయుధాలను కలిగి ఉండకూడదు, తయారు చేయకూడదు, తమ భూభాగంలోకి అనుమతించకూడదు అనే తన సుదీర్ఘమైన మూడు అణురహిత సూత్రాలను సవరించేందుకు జపాన్ ప్రస్తుత ప్రభుత్వం యోచిస్తోందని చైనా ఆరోపించింది. జపాన్ వద్ద సీక్రెట్‌గా వేపన్-గ్రేడ్ ప్లూటోనియం తయారు చేసే సామర్థ్యంతో పాటు అత్యల్ప సమయంలో అణు ఆయుధాలను సిద్ధం చేసే సాంకేతిక, ఆర్థిక వనరులు ఉన్నాయని చైనా వర్గాలు పేర్కొన్నాయి.
అణు దాడి నమూనా ... చైనా నగరాలకు ప్రమాదం
1945 లో జపాన్‌లోని హిరోషిమాపై జరిగిన అణుదాడి ఆధారాలు, అంతర్జాతీయ సమాచారాన్ని విశ్లేషిస్తూ పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ ఒక నమూనా అధ్యయనం చేసింది. ఒకవేళ చైనాలోని ప్రధాన నగరంలో ఒకే ఒక్క తక్కువ సామర్థ్యం గల అణుదాడి జరిగినా, ఊహించని రీతిలో ప్రాణనష్టం, భయానక వాతావరణం ఏర్పడుతుందని అంచనా వేసింది. అంతేకాదు, సాధారణ అణు ప్రమాదాలతో పోలిస్తే, సైనిక లేదా తీవ్రవాద అణు దాడి జరిగినప్పుడు తీవ్రమైన రేడియేషన్ గాయాలు చికిత్సకు పెద్ద సవాలుగా మారతాయని స్పష్టం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని చైనా ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకుంటోంది.
ముందస్తు సన్నాహాలు ... అత్యవసర నెట్వర్క్
అణు ముప్పును ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటికే 30 కి పైగా ప్రత్యేక రెస్క్యూ బేస్‌లతో ఎమర్జెన్సీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యాంటిబయోటిక్స్, రేడియేషన్ రక్షణ పరికరాలు, రక్షణ దుస్తులను ముందస్తుగా నిల్వ చేసుకోవాలని స్థానిక అధికారులను హెచ్చరించింది. దీనిపై ప్రజల్లో అశాంతి లేదా భయాందోళనలు కలగకుండా ముందస్తుగా రేడియేషన్ రక్షణ ప్రోటోకాల్స్‌పై విద్యను అందించాలని సిఫార్సు చేసింది. ముందస్తు సన్నాహాల్లో భాగంగానే వీటిని ఆర్మీ సూచిస్తోంది. యుఎస్ పీ-5 దేశాలు 2022 లో "అణు యుద్ధం గెలవలేము, దానిని ఎప్పటికీ చేయకూడదు" అని సంయుక్త ప్రకటన చేసినప్పటికీ, చైనా మాత్రం జపాన్ మళ్లీ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడంపై ఆందోళన చెందుతూ ముందస్తు రక్షణ చర్యలకు పిలుపునిచ్చింది.




