China Court Rules: ఏఐ సాకుతో ఉద్యోగులను పీకేయడం కుదరదు.. చైనా కోర్టు సంచలన తీర్పు
China Court Rules:ఏఐ సాకుతో ఉద్యోగులను తొలగించడం చట్టవిరుద్ధమని చైనా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఖర్చు తగ్గించుకోవడానికి మనుషులను ఏఐతో భర్తీ చేయకూడదని కంపెనీలను హెచ్చరించింది.
China Court Rules
China Court Rules: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్న కంపెనీలకు చైనా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టెక్నాలజీ పెరుగుతోందని, ఖర్చులు తగ్గించుకోవాలని సాకులతో మనుషులను తీసేసి ఆ ప్లేస్‌లో ఏఐని పెడతామంటే కుదరదని తేల్చి చెప్పింది. మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా వెలువడిన ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది. ఈ వివాదం చైనాలోని హాంగ్‌జౌ నగరంలో మొదలైంది. ఝౌ అనే వ్యక్తి 2022లో ఒక ఏఐ కంపెనీలో క్వాలిటీ అస్యూరెన్స్ సూపర్వైజర్‌గా చేరాడు. అతనికి నెలకు 25 వేల యువాన్ల (సుమారు రూ.2.9 లక్షలు) జీతం ఉండేది. అతని పని ఏంటంటే.. ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ ఇచ్చే సమాచారాన్ని చెక్ చేయడం, తప్పులు ఉంటే సరిదిద్దడం. అయితే కొద్ది రోజుల తర్వాత కంపెనీ తెలివిగా ఆ పనులను ఏఐతోనే చేయించడం మొదలుపెట్టింది. ఇక నీ పని తగ్గిపోయింది కాబట్టి నీకు 15 వేల యువాన్లే ఇస్తాం, కావాలంటే లో లెవల్ జాబ్ చేసుకో అని ఝౌని వేధించింది. దానికి అతను ఒప్పుకోకపోవడంతో, కంపెనీ రీస్ట్రక్చరింగ్ పేరుతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది.
తన ఉద్యోగం పోవడాన్ని ఝౌ తీవ్రంగా పరిగణించి లేబర్ కమిటీని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చినా, కంపెనీ పట్టువదలక కోర్టుకు వెళ్లింది. చివరకు హాంగ్‌జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు ఈ కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కేవలం డబ్బులు ఆదా చేయడానికి లేదా ఏఐ టెక్నాలజీ అందుబాటులో ఉందని ఒక ఉద్యోగిని తీసేయడం చట్టరిత్యా నేరమని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమైన తొలగింపులు కిందకే వస్తాయని మండిపడింది. టెక్నాలజీ అనేది మనిషికి సాయం చేయాలి తప్ప, అతని ఉపాధిని దూరం చేయకూడదని హితవు పలికింది.
ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు అన్నీ ఏఐని వాడుతూ వేల సంఖ్యలో లేఆఫ్స్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో చైనా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచ దేశాలకు ఒక దిశానిర్దేశంలా మారింది. కంపెనీలు తమ లాభాల కోసం టెక్నాలజీని సాకుగా చూపి కార్మికుల హక్కులను కాలరాయకూడదని ఈ తీర్పు నిరూపించింది. మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి ముందే ఈ తీర్పును బహిరంగపరచడం ద్వారా, కార్మికుల పక్షాన ప్రభుత్వం మరియు న్యాయవ్యవస్థ ఉన్నాయని చైనా గట్టి సందేశాన్ని పంపింది.
ఆటోమేషన్ పెరగడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవనే ఆందోళనలో ఉన్న సాఫ్ట్‌వేర్, టెక్ ఉద్యోగులకు ఈ జడ్జిమెంట్ కొండంత అండగా నిలుస్తోంది. కంపెనీలు ఏఐని వాడవచ్చు కానీ, ఉన్న ఉద్యోగులను బలవంతంగా తీసేయడానికి వీలు లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ కంపెనీలు ఇలాంటి పనులకు పాల్పడితే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ తీర్పు తర్వాత చైనాలోని అనేక టెక్ కంపెనీలు తమ లేఆఫ్ ప్లాన్లను పునరాలోచించుకునే అవకాశం ఉంది. మన దేశంలో కూడా ఇలాంటి చట్టాలు రావాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు.




