China Nuclear Expansion: చైనా అణుశక్తిని మరింత పెంచుకుంటోందా? రహస్యాన్ని బట్టబయలు చేసిన శాటిలైట్ చిత్రాలు
చైనా సీక్రెట్‌గా జిన్జియాన్ ఎడారి ప్రాంతంలో హామీ అణుక్షిపణి కేంద్రాల సమీపంలో పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలను చేపడుతున్నది. సుమారు 80 నిర్మాణాలను ఏర్పాటు చేసింది. క్షిపణులను ప్రయోగించడానికి వీలుగా లాంచ్‌ప్యాడ్స్ కోసమే వీటిని నిర్మించినట్టు తెలుస్తోంది.
China Nuclear Expansion: అంతర్జాతీయంగా చైనా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఎలాగైనా తైవాన్‌ను తన సొంతం చేసుకోవాలని చూస్తున్న చైనా సరికొత్త ఆయుధాలను తయారు చేసుకుంటూ తన సైనిక సంపత్తిని పెంచుకుంటోంది. కాగా, ఇప్పుడు చైనా మరో అణు స్థావరాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు బయటకు రావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైనా తన అణుశక్తిని, క్షిపణి వ్యవస్థను వేగంగా విస్తరిస్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. శతృదేశం మొదటి దెబ్బ కొట్టినా తట్టుకొని ఎదురుదాడి చేసేలా చైనా వాయువ్య ఏడాదిలో భారీ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఇప్పుడు బయటపడిన శాటిలైట్ చైనా వ్యూహాత్మక అణు రక్షణ వలయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ చిత్రాలు బయటకు రావడంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఎడారిలో అష్టభుజి ఆకారాలు
రాయిటర్స్ వార్తా సంస్థ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. చైనాలోని జిన్జియాంగ్ ఎడారి ప్రాంతంలో, 'హామీ' అణు క్షిపణి కేంద్రాలకు సమీపంలో విచిత్రమైన నిర్మాణాలు వెలుగుచూశాయి.80కి పైగా లాంచ్‌ప్యాడ్‌లను ఈ ఎడారిలో నిర్మిస్తోంది. మొబైల్ క్షిపణి లాంచర్లు, వైమానిక బ్యాటరీ వ్యవస్థలను మోహరించడానికి వీలుగా ఎడారిలో ఈ కాంక్రీట్ ప్యాడ్‌లను చైనా నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. గత ఆరేళ్ల కాలంలో ఈ ఎడారిలో రెండు ఆక్టాగాన్ ఆకారంలో సైనిక స్థావరాలను నిర్మించింది. ఇవి క్షిపణి నిల్వ కేంద్రాలుగా, కమాండ్ కంట్రోల్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక పెంటగాన్ నివేదిక ప్రకారం, చైనా ఇప్పటికే మూడు క్షిపణీ కేంద్రాలను నిర్మించుకుంది. సుమారు 100కిపైగా ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసుకుంది. అదేవిధంగా 2030 నాటికి 1000 అణ్వాయుధాలను కలిగి ఉండాలనే లక్ష్యంతో చైనా రక్షణశాఖ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అమెరికాకు సవాల్‌గా మారిన 'హోయాన్-1'
చైనా కేవలం క్షిపణులను దాచడమే కాకుండా, తన ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అత్యంత ఆధునీకరించింది. చైనాకు చెందిన 'హోయాన్-1' శాటిలైట్లు శత్రుదేశం క్షిపణిని ప్రయోగించిన కేవలం 90 సెకన్లలో దానిని గుర్తించగలవు. ఆ సమాచారం తదుపరి మూడు నుంచి నాలుగు నిమిషాలలో కమాండ్ సెంటర్‌కు చేరుతుంది. అంటే శత్రువు క్షిపణి వచ్చి పడేలోపే చైనా తన అణ్వాయుధాలను ప్రయోగించి తిప్పికొట్టగలదు. అమెరికా, రష్యాలు తమ ఆయుధాల సంఖ్యపై ఆధారపడితే, చైనా మాత్రం తన క్షిపణులను కాపాడుకోవడానికి ఎడారిలో వేల చదరపు కిలోమీటర్ల మేర రహస్యంగా రోడ్లు, బంకర్లు, ఫైబర్ ఆప్టికల్ నెట్‌వర్క్‌లను నిర్మించుకుంటోంది. తైవాన్ సార్వభైమాధికారం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరించిన తరుణంలో ఈ శాటిలైట్ చిత్రాలు బయటకు రావడం గమనార్హం. అణ్వాయుధాలను పెంచుకోవాలని కొన్ని దేశాలు చూస్తుంటే... అసలు అణ్వాయుధాలే వద్దని కొందరు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా అణుశక్తిని నవీణీకరణ చేయడంతో పాటు భారీ స్థాయిలో ఆయుధాలను పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలపై ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.




