China Influence on G7: జీ 7 లోనూ చైనా పెత్తనం...మెంబర్ కాకున్నా ఆదిపత్యం
జీ 7 దేశాల కూటమిలో చైనా ఇప్పడి వరకు అధికారికంగా లేకున్నా... ఆయా దేశాల చర్చల్లో చైనా మాట లేకుండా ఉండటం అసాధ్యంగా మారింది. కారణాలు ఇవే.
China Influence on G7: రాజకీయ యవనికపై అత్యంత శక్తివంతమైన 7 ప్రజాస్వామ్య దేశాల కూటమి 'జీ-7' సదస్సు జరగబోతున్నది. వచ్చే వారం ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లే-బెయిన్స్ వేదికగా 52వ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరగబోతున్నది. చిత్రం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక కూటమిలో అధికారికంగా సభ్యత్వం లేకపోయినప్పటికీ... చైనా తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యంతో జీ-7 చర్చలను శాసిస్తోంది. ప్రపంచంలోనే రెండొవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనాను ఈ కూటమిలోకి ఎందుకు రానివ్వలేదు? కూటమిలో సభ్యులు కాకపోయినా జీ-7 లో చైనా పెత్తనం ఎలా సాగుతోంది? ఆసక్తికరమైన విషయాలను విశ్లేషణాత్మక కోణంలో చర్చించుకుందాం.
చైనాకు జీ-7 లో చోటు దక్కకపోవడానికి కారణం ఇదే!
నిజానికి జీ-7 కూటమి పునాదులు 1975 నాటి చమురు సంక్షోభం సమయంలో పడ్డాయి. మొదట ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలతో ‘జీ-6’గా ఏర్పడగా...ఆ తరువాత 1976లో కెనడా చేరికతో ‘జీ-7’గా మారింది. కొంతకాలం తరువాత రష్యా చేరి జీ 8గా మారినా... 2014లో క్రిమియా ఆక్రమణ కారణంగా దాన్ని పక్కన పెట్టారు. మరలా ఆ కూటమిలోకి రష్యా చేరలేదు. జీ 7 ఏర్పడినపుడు చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. అయితే, ప్రస్తుతం చైనా ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నా, జీ-7 దేశాలు దాన్ని చేర్చుకోకపోవడానికి ముఖ్య కారణం 'రాజకీయ సిద్ధాంతం'. జీ-7 అనేది కేవలం ఆర్థిక కూటమి కాదు. అది ప్రజాస్వామ్య విలువలు గల దేశాల వేదిక. చైనాలోని ‘ఏకపార్టీ కమ్యూనిస్ట్ పద్ధతి’ ఈ ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఈ కారణంగానే చైనా జీ 7 కూటమిలో చేరలేకపోయింది. అయితే, జీ 7 అంటే చాలా మంది అభివృద్ధి చెందిన దేశాల కూటమి మాత్రమే అనుకుంటాం. అసలు విషయం ఇదే.
మెంబర్ కాకపోయినా అగ్రదేశాలపై చైనా పట్టు!
కూటమిలో లేకపోయినా జీ-7 సదస్సులో జరిగే ప్రతి పెద్ద చర్చా చైనా చుట్టూనే తిరుగుతుంది. చైనా ఊసులేకుండా చర్చలు జరగకపోవడం విచిత్రం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే వస్తువులలో దాదాపు 30 శాతం వాటా చైనాదే. ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ సరఫరాలో చైనా నంబర్ వన్. అయితే, చైనాపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి జీ-7 దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి, కానీ ఆ మార్కెట్‌ను పూర్తిగా వదులుకోవడం వాటి వల్ల కావడం లేదు. అంతేకాదు, తైవాన్ జలసంధి వివాదం, దక్షిణ చైనా సముద్రంలో మిలిటరీ కదలికలు ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను భయపెడుతున్నాయి. తైవాన్ నుంచి చిప్స్ రాకపోతే ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు, రక్షణ వ్యవస్థలు స్తంభించిపోతాయి.
ఈ విధంగా జీ-7 దేశాలు చైనాను దూరం పెట్టాలని చూస్తున్నా, గ్లోబల్ సప్లై చైన్, క్లైమేట్ లక్ష్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రతి అంశంలోనూ బీజింగ్ నీడ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే, కమ్యునిస్ట్ పార్టీకి చైనా ప్రతీక అయిన చైనా జీ-7లో లేకపోయినా, నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే 'జీ-20' కూటమిలో భారత్, బ్రెజిల్, సౌదీలతో పాటు చైనా కీలక వ్యవస్థాపక సభ్యులుగా చలామణి అవుతోంది. జీ 7కి ప్రత్యామ్నాయంగా వచ్చిందే జీ 20. జీ 7 కూటమి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందానా ఆగిపోగా... జీ 20 అందుకు భిన్నంగా భిన్నమైన ఆలోచనలతో... భిన్నమైన ప్రపంచాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నది. అధికారికంగా ఇది జీ 20 అయినా... ఇందులో సభ్యదేశాలుగా చేరేందుకు చిన్న మధ్యతరగతి దేశాలు కూడా ఆసక్తి చూపుతుండటం విశేషం.




