China Iran talks: పాక్ నుంచి చైనాకు...పశ్చిమాసియా ముఖచిత్రం మారుతుందా?
బీజింగ్ వేదికగా జరుగుతున్న తాజా దౌత్య చర్చలు ప్రపంచ రాజకీయ పటంలో సరికొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య నలుగుతున్న యుద్ధ మేఘాల మధ్య చైనా పాత్ర ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
China Iran talks: బీజింగ్ వేదికగా జరుగుతున్న తాజా దౌత్య చర్చలు ప్రపంచ రాజకీయ పటంలో సరికొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య నలుగుతున్న యుద్ధ మేఘాల మధ్య చైనా పాత్ర ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు అజెండాగా ఉన్నాయి. ఒకటి కాల్పుల విరమణను కొనసాగించడం, రెండోది ప్రపంచ వాణిజ్యానికి ప్రాణవాయువు వంటి 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి తెరవడం. మరి చైనా వేదికగా జరుగుతున్న ఈ శాంతి దౌత్య చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి. అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటనకంటే ముందే ఇరాన్ చైనాకు చేరుకొని తమ డిమాండ్లను చైనా ముందు ఉంచింది.
చైనా వ్యూహం - ఇరాన్ అంచనాలు
ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని చైనా మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడాన్ని కూడా బీజింగ్ సమర్థించడం లేదు. ఎందుకంటే, ఇది ప్రపంచ ఇంధన సరఫరాపై కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ నేపథ్యంలో, ఇరాన్ విదేశాంగ మంత్రి చైనా నుంచి ఒక స్పష్టమైన హామీని ఆశిస్తున్నారు. త్వరలో ట్రంప్‌తో జరగబోయే సమావేశంలో చైనా ఏవైనా రాయితీలు ఇచ్చి ఇరాన్‌ను ఇరకాటంలో పెడుతుందా? అనే అనుమానం టెహ్రాన్ వర్గాల్లో ఉంది. ఇందుకు ప్రతిగా, చైనా కూడా ఇరాన్ నుంచి ఒక భరోసా కోరుతోంది. అదేంటంటే, చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్ ఎలాంటి ఆవేశపూరిత లేదా ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు. మరి ట్రంప్ నుంచి ఇలాంటి భరోసా వస్తుందా అంటే ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.
ఇరాన్-చైనా బంధం
చైనాకు ఇరాన్ ఎందుకు ముఖ్యమో ఈ వివరాలు చూస్తేనే అర్థమౌతుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు చైనా తన మొత్తం ముడి చమురులో 13 శాతం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునేది. అంతేకాదు, చమురు వ్యాపారంలో డాలర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ, యుద్ధం తరువాత ఇరాన్ చమురు చెల్లింపులను చైనా కరెన్సీ యునాన్‌ను ప్రోత్సహిస్తోంది. ఇది చైనా ఆర్థిక బలాన్ని పెంచుతుంది. యునాన్ ప్రోత్సహించి ఆ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిగితే దాని వలన చైనా ఆర్థికంగా లాభం పొందుతుంది. ఇక 2021లో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఈ రెండు దేశాల బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య 25 ఏళ్ల ఒప్పందం ఉంది. 2021 నుంచి 25 ఏళ్లపాటు చమురును ఇరాన్ సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఐక్యరాజ్యసమితిలో అండ
అమెరికా మరిన్ని ఆంక్షలు విధించకుండా అడ్డుకోవాలంటే ఇరాన్‌కు చైనా మద్దతు తప్పనిసరి. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో చైనా ఇచ్చే 'వీటో' అండ ఇరాన్ మనుగడకు కీలకం. అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ఇరాన్ ఒక బలమైన శక్తిగా ఉండాలని చైనా కోరుకుంటోంది. మొత్తంగా చెప్పాలంటే ఈ బీజింగ్ చర్చలు కేవలం రెండు దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల ఇంధన భద్రతను, చమురు ధరలను శాసించబోతున్నాయి. పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇప్పుడు చైనా వేదికగా జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు పశ్చిమాసియాలో శాంతిని పునరుద్దరిస్తుందా చూడాలి.




