India -China: భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా చైనా.. పూర్తి లెక్కలు ఇవే..!

India -China: గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.

Naresh.k
Published on: 16 April 2026 10:19 AM IST
India -China
X

India -China: భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా చైనా.. పూర్తి లెక్కలు ఇవే..!

Trading Partner: భారత వాణిజ్య రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. గత నాలుగేళ్లుగా అగ్రరాజ్యం అమెరికా దక్కించుకున్న స్థానాన్ని ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనా కైవసం చేసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు? అంటే నిన్నటి వరకు అమెరికా అని చెప్పేవాళ్ళం. కానీ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సీన్ మారింది. చైనా మళ్ళీ మొదటి స్థానానికి చేరుకుంది.

లెక్కలు ఏం చెబుతున్నాయి?

భారత్ , చైనా మధ్య మొత్తం వాణిజ్యం సుమారు రూ. 14.09 లక్షల కోట్లు చేరుకుంది. చైనాకు భారత ఎగుమతులు ఏకంగా 36.66 శాతం పెరిగి 19.47 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. అదే సమయంలో చైనా నుండి దిగుమతులు కూడా 16 శాతం పెరిగి 131.63 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్యం పెరగడం ఒక ఎత్తు అయితే, వాణిజ్య లోటు పెరగడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

వాణిజ్య లోటు అంటే ఏమిటి?

మనం ఒక దేశానికి ఎగుమతి చేసే దానికంటే..ఆ దేశం నుండి ఎక్కువ దిగుమతి చేసుకుంటే దానిని వాణిజ్య లోటు అంటారు. చైనాతో మన దేశ వాణిజ్య లోటు చారిత్రాత్మక గరిష్ఠానికి చేరింది. 2024-25లో 99.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు, 2025-26 నాటికి 112.16 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే మనం చైనాకు అమ్ముతున్న దానికంటే, అక్కడి నుండి కొంటున్నదే చాలా ఎక్కువగా ఉంది.

రెండో స్థానంలో అమెరికా

గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఇక్కడ భారత్‌కు ఒక సానుకూల అంశం ఉంది. అమెరికాతో వాణిజ్య లోటు 40.89 బిలియన్ డాలర్ల నుండి 34.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. అంటే అమెరికాకు మనం చేసే ఎగుమతులు పెరిగాయి , దిగుమతులపై మన పట్టు పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం.

చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించడం వెనుక ప్రధానంగా ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్ , ఫార్మా రంగానికి అవసరమైన ఏపీఐ దిగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనాపై ఆధారపడటం తగ్గించాలని భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రస్తుత పారిశ్రామిక అవసరాల రీత్యా ఆ దేశంతో వ్యాపారం తప్పనిసరి అవుతోంది. వ్యాపార పరంగా చైనా నంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ, అమెరికాతో వాణిజ్య లోటు తగ్గడం భారత్ తన ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నదనడానికి నిదర్శనం. భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా బలోపేతం అయితేనే చైనాతో పెరుగుతున్న ఈ భారీ వాణిజ్య లోటును అరికట్టడం సాధ్యమవుతుంది.

Naresh.k

Naresh.k

Next Story