China Smoking Crisis : ప్రెసిడెంట్ చెప్పినా వినట్లేదు..ప్రపంచంలో సగం సిగరెట్లు చైనా వాళ్లే తాగేస్తున్నారట

China Smoking Crisis : ప్రపంచంలోని మొత్తం సిగరెట్లలో సగానికి పైగా చైనాలోనే వినియోగమవుతున్నాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆంక్షలు విధించినా 30 కోట్ల మంది చైనీయులు ధూమపానం వీడకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 28 May 2026 8:09 AM IST
China Smoking Crisis
X

China Smoking Crisis

China Smoking Crisis : ప్రపంచవ్యాప్తంగా ధూమపానం అలవాటుపై అవగాహన పెరుగుతుండటంతో సిగరెట్ల వినియోగం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. కానీ మన పొరుగు దేశమైన చైనాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా, అత్యంత భయానకంగా మారుతోంది. బీజింగ్ నుంచి తాజాగా విడుదలైన అధికారిక నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా సిగరెట్లు తాగే దేశంగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనా జనాభాలో ప్రతి వంద మందిలో 23 మంది చొప్పున (అంటే దాదాపు 23 శాతం మంది) సిగరెట్లకు బానిసలయ్యారు. చైనా మొత్తం జనాభా సుమారు 140 కోట్లు కాగా.. ఇందులో దాదాపు 30 కోట్ల మంది చైనీయులు నిత్యం పొగ తాగుతూ తమ ఊపిరితిత్తులను గుల్ల చేసుకుంటున్నారు.

షాకింగ్ విషయమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో సగటున 5 ట్రిలియన్ల సిగరెట్లు అమ్ముడవుతుంటే.. అందులో సగానికి సగం అంటే ఏకంగా 2.4 ట్రిలియన్ల సిగరెట్లను కేవలం చైనా ప్రజలే తాగేస్తున్నారు. 2003 నుంచి 2023 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినియోగం 26 శాతం తగ్గితే.. అదే సమయంలో చైనాలో మాత్రం ఈ వినియోగం ఏకంగా 39 శాతం పెరగడం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ధూమపానానికి వ్యతిరేకంగా ఎంత పెద్ద యుద్ధం ప్రకటించినా, చైనాలో పొగ సెగలు మాత్రం అస్సలు తగ్గడం లేదు.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 2012లో షీ జిన్‌పింగ్ చైనా దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, దేశంలో పొగాకు వినియోగాన్ని పూర్తిగా అరికడతానని పెద్ద ఎత్తున శపథం చేశారు. ఆ సమయంలో చైనాకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తతో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. "నేను కూడా ఒకప్పుడు విపరీతంగా సిగరెట్లు తాగేవాడిని. కానీ దేశ బాధ్యతలు చేపట్టాక ఆ అలవాటును పూర్తిగా మానేశాను. సిగరెట్లు మానేసిన తర్వాత నా ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది, చాలా యాక్టివ్‌గా ఫీలవుతున్నాను" అని తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు.

అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ హెల్తీ చైనా 2030 మిషన్‌లో భాగంగా పొగాకు రహిత దేశంగా మార్చడానికి అనేక కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సిగరెట్లు అమ్మడం చైనాలో తీవ్రమైన నేరం. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే భారీ జరిమానాలు విధిస్తారు. సిగరెట్ల వినియోగాన్ని తగ్గించడానికి 2022 లో జిన్‌పింగ్ ప్రభుత్వం సిగరెట్లపై అదనంగా 10 శాతం పన్ను విధించడమే కాకుండా, యువతను ఆకర్షిస్తున్న ఈ-సిగరెట్లు పై కూడా కఠినమైన నిషేధ ఆంక్షలు విధించింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ చట్టాలు సరిగ్గా అమలు కాకపోవడంతో ఫలితం శూన్యంగా మారింది.

డ్రాగన్ దేశంలో ఇన్ని చట్టాలు ఉన్నా సిగరెట్ల వినియోగం తగ్గకపోవడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వ ద్వంద్వ నీతి, భారీ వ్యాపార ప్రయోజనాలేనని నిపుణులు చెప్తున్నారు. చైనాలో సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాల మొత్తం వ్యవహారాలను ప్రభుత్వ అధీనంలోని చైనా నేషనల్ టొబాకో కార్పొరేషన్(CNTC) అనే ఒకే ఒక్క సంస్థ చూసుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పొగాకు కంపెనీ అయిన దీని లాభాలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం 2025 ఆర్థిక సంవత్సరంలోనే ఈ కంపెనీ ఏకంగా 244 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది.

ఈ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం చైనా ప్రభుత్వ మొత్తం వార్షిక ఆదాయంలో ఏకంగా 7 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత చైనా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి ఇదే పొగాకు కంపెనీని చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం కోసం పొగ తాగొద్దని చెప్తూనే.. మరోవైపు ప్రభుత్వ ఖజానా నిండటానికి సిగరెట్ల అమ్మకాలను పరోక్షంగా పెంచడం వల్లనే చైనాలో ఈ పొగ మహమ్మారిని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story