China: సోషల్ మీడియా ఆల్గరిథమ్లకు చెక్...చైనా కొత్త వ్యూహం
సోషల్ మీడియా అల్గారిథమ్‌లపై చైనా కఠిన నియంత్రణలకు సిద్ధమవుతోంది. వ్యూస్, రీచ్, ట్రెండింగ్ పోస్టులు ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? కింగ్‌లాంగ్ ప్రచారం, టెక్ కంపెనీలపై చర్యలు, కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం.
China: సోషల్ మీడియాలో ఏ వార్త కనిపించాలి? ఏ వీడియో వైరల్ కావాలి? ఏ అంశం ట్రెండింగ్‌లో ఉండాలి? ఇప్పటివరకు ఈ నిర్ణయాల్లో టెక్నాలజీ కంపెనీల అల్గారిథమ్లదే కీలక పాత్ర. అయితే, ఈ వ్యవస్థలు ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరాయని చైనాలోని కమ్యూనిస్టు పార్టీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్, క్లిక్స్, లాభాల కోసం పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఇకపై స్పష్టమైన పరిమితులు విధించాలని వారు కోరుతున్నారు. ప్రజలకు ఏ సమాచారం చేరాలనే విషయంలో టెక్ కంపెనీలకు ఉన్న అధికారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది?
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కమ్యూనిస్టు పార్టీ కమిటీ ప్రచార విభాగం గురువారం ఆన్లైన్లో ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. సోషల్ మీడియా అల్గారిథమ్‌లు, ఆన్లైన్ ట్రాఫిక్ ప్రభావంపై ఇందులో కీలక అంశాలను ప్రస్తావించింది. జెజియాంగ్ ప్రావిన్స్‌లోనే చైనాలో ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా పేరున్న హాంగ్జౌ నగరం ఉంది. దీంతో అక్కడి అధికారుల వ్యాఖ్యలు దేశంలోని ప్రధాన ఇంటర్నెట్ కంపెనీలకు నేరుగా వర్తించే అంశంగా మారాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2002 నుంచి 2007 వరకు జెజియాంగ్ ప్రావిన్స్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పార్టీ విభాగం చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వ్యూస్, రీచ్ కేవలం సంఖ్యలు కావు!
సోషల్ మీడియాలో ఒక పోస్టుకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఎంతమంది లైక్ చేశారు? ఏ అంశం ఎక్కువగా షేర్ అవుతోంది? ఇవన్నీ సాధారణంగా డిజిటల్ ట్రాఫిక్ కొలమానాలుగా భావిస్తారు. కానీ ఈ గణాంకాలు ఇప్పుడు ప్రజలు ఏ అంశాల గురించి చర్చించాలి, దేనిపై స్పందించాలి అనే విషయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని చైనా అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రజలకు కనిపించే సోషల్ మీడియా ఫీడ్‌లోని ట్రాఫిక్‌ను కేవలం ప్రైవేట్ టెక్ కంపెనీల ఆస్తిగా చూడకూడదని వారు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేసే ఉమ్మడి వనరుగా పరిగణించి, దాని వినియోగంపై స్పష్టమైన నియమాలు ఉండాలని సూచించారు.
సంచలనాలకు ప్రాధాన్యం.. కీలక అంశాలకు తక్కువ రీచ్?
సోషల్ మీడియా సంస్థలు ప్రజా ప్రయోజనాల కంటే క్లిక్స్, వ్యూస్, ప్రకటనల ఆదాయానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని అధికారులు విమర్శించారు. ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించే సెలబ్రిటీల గాసిప్, వివాదాస్పద పోస్టులు, సంచలనాత్మక విషయాలు ట్రెండింగ్ జాబితాల్లో ముందుంటున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో సాంకేతిక అభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి అంశాలకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిణామాలపై ప్రజలకు ఉండే అవగాహన తగ్గే ప్రమాదం ఉందని వారి అభిప్రాయం. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఆసక్తి కూడా క్రమంగా బలహీనపడవచ్చని హెచ్చరించారు. ఆన్లైన్ వివాదాల విషయంలోనూ అల్గారిథమ్‌లు సమస్యను పెంచుతున్నాయని అధికారులు ఆరోపించారు. ఒక అంశంపై ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వాదనను సిఫార్సుల వ్యవస్థ మరింత మందికి చూపిస్తుంది. దీంతో ఎక్కువ మంది వ్యాఖ్యలు చేయడం, ప్రతిస్పందించడం మొదలవుతుంది. చివరకు చిన్న వివాదమే పెద్ద ఘర్షణగా మారి సమాజంలో విభేదాలను పెంచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?
వినియోగదారులు ఏ పోస్టులను చూస్తున్నారు? ఏ వీడియోలను ఇష్టపడుతున్నారు? దేనిపై ఎక్కువ సమయం గడుపుతున్నారు? వంటి అంశాలను విశ్లేషించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కంటెంట్‌ను సిఫార్సు చేస్తాయి. దీనివల్ల వినియోగదారులు యాప్‌లో ఎక్కువసేపు ఉండే అవకాశం పెరుగుతుంది. అయితే, ఒకే తరహా అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులు పదేపదే కనిపిస్తే ఇతర దృక్కోణాలను తెలుసుకునే అవకాశం తగ్గవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ఉన్న అపోహలు బలపడటం, సమాజంలో అభిప్రాయ భేదాలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. అలాగే ఏ ఖాతాను నిషేధించాలి, ఏ పోస్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, దేనికి రీచ్ తగ్గించాలి అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియడం లేదని చైనా అధికారులు విమర్శించారు. కంపెనీలకు సమాజంపై విస్తృత ప్రభావం ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో జవాబుదారీతనం కనిపించడం లేదని పేర్కొన్నారు.
కఠిన నియంత్రణలకు చైనా ప్రణాళిక
సోషల్ మీడియా సంస్థల అధికారాలకు పరిమితులు విధించాలని, వాటి నియమాలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచాలని జెజియాంగ్ పార్టీ విభాగం సూచించింది. నాణ్యతలేని కంటెంట్‌ను ప్రోత్సహించే, ఆన్లైన్ వివాదాలను రెచ్చగొట్టే ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కంటెంట్ నిర్వహణలో కంపెనీలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, తమ నియమాలను స్పష్టంగా వెల్లడించాలని పేర్కొంది.
2016 నుంచి కొనసాగుతున్న ‘కింగ్‌లాంగ్’ ప్రచారం
చైనాలో ఆన్లైన్ కంటెంట్‌పై నియంత్రణ కొత్త విషయం కాదు. సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAC) 2016 నుంచి ‘కింగ్‌లాంగ్’ పేరుతో ఇంటర్నెట్ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతంలో వీబో, రెడ్‌నోట్, కువైషౌ వంటి వందల మిలియన్ల నెలవారీ వినియోగదారులున్న ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకుంది. ట్రెండింగ్ జాబితాల్లో సెలబ్రిటీల గాసిప్, విలువ తక్కువగా ఉన్న అంశాలు ఎక్కువగా కనిపించడంపై వాటిని ప్రశ్నించింది. CAC అధిపతి జువాంగ్ రోంగ్వెన్ ఆగస్టులో పార్టీ పత్రిక ‘డాంగ్జియాన్’లో రాసిన వ్యాసం ప్రకారం, 2021 నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు 60కి పైగా దశల్లో నియంత్రణ చర్యలు చేపట్టారు.
ఈ ఒత్తిడితో కొన్ని కంపెనీలు తమ సిఫార్సుల వ్యవస్థల్లో మార్పులు చేశాయి. రెడ్‌నోట్, చైనా టిక్‌టాక్‌గా పేరున్న డౌయిన్ వంటి సంస్థలు వినియోగదారులకు తమ ఫీడ్‌పై ఎక్కువ నియంత్రణ కల్పించడం, విభిన్న కంటెంట్‌ను చూపించడం, అల్గారిథమ్‌ల పనితీరుపై మరింత పారదర్శకత తీసుకురావడం వంటి చర్యలు చేపట్టినట్లు CAC తెలిపింది. మొత్తంగా, సోషల్ మీడియా అల్గారిథమ్‌లను నియంత్రించాలన్న చైనా ప్రయత్నం టెక్నాలజీ కంపెనీల బాధ్యతపై మరోసారి చర్చకు దారితీస్తోంది. ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం చేరాలనే లక్ష్యం ఒకవైపు ఉంటే, ఆన్లైన్ సమాచారంపై ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు ఉండాలనే ప్రశ్న మరోవైపు ఉంది. కాబట్టి ఈ పరిణామాన్ని కేవలం సోషల్ మీడియా సంస్కరణగా కాకుండా, డిజిటల్ సమాచారంపై అధికారం ఎవరిది అనే విస్తృత చర్చలో భాగంగా చూడాలి.




