Monkey Demand : ఒక్కొక్క దానికి రూ.30లక్షలు.. 50000 కోతులు అర్జంట్
Monkey Demand : చైనాలో ల్యాబ్ కోతుల డిమాండ్ ఊహించని రీతిలో పెరిగింది. బయోటెక్, కొత్త ఔషధాల పరిశోధనలు ముమ్మరం కావడంతో ఒక్కో కోతి ధర రూ.30 లక్షల మార్కును తాకింది.
Monkey Demand
Monkey Demand : చైనా మార్కెట్‌లో ప్రస్తుతం కోతులకు ఎన్నడూ లేనంత భారీ డిమాండ్ ఏర్పడింది. అక్కడ కోతుల వ్యాపారం ఇప్పుడు వందల కోట్ల బిజినెస్‌గా మారిందంటే నమ్మడం కష్టమే కానీ ఇది అక్షరాలా నిజం. చైనాలోని సైంటిఫిక్ రీసెర్చ్ ల్యాబ్‌లలో ఉపయోగించే మకాక్ రకం కోతుల ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం అక్కడ ఒక ఆరోగ్యకరమైన, పరిశోధనలకు సిద్ధంగా ఉన్న కోతి ధర దాదాపు 2 లక్షల యువాన్లు పలుకుతోంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 24 నుంచి 30 లక్షల రూపాయల అన్నమాట. చైనాలో వేగంగా విస్తరిస్తున్న ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రపంచానికి కేవలం ఒక ఉత్పాదక ఫ్యాక్టరీలా మాత్రమే కాకుండా, సరికొత్త ఔషధాల ఆవిష్కరణలో అమెరికా వంటి అగ్రరాజ్యాలకు గట్టి పోటీ ఇవ్వాలని చైనా భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
మనుషుల లాంటి డీఎన్‌ఏ ఉండటమే కారణం
అసలు పరిశోధన ల్యాబ్‌లలో ఈ కోతులకు ఎందుకు ఇంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవాలి. ఏదైనా కొత్త మందు లేదా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు అనేక రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మొదట ల్యాబ్‌లో రసాయన పరీక్షలు, ఆ తర్వాత జంతువులపై ప్రీ-క్లినికల్ ట్రయల్స్, చివరిగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రీసస్, సినోమోల్గస్ రకానికి చెందిన మకాక్ కోతుల డీఎన్‌ఏ, వాటి శరీర అంతర్గత నిర్మాణం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు మనుషులను పోలి ఉంటాయి. అందుకే క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, మెదడు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన బయోలాజికల్ మందులు, యాంటీబాడీ చికిత్సల సురక్షితత్వాన్ని పరీక్షించడానికి ఈ కోతులపై ట్రయల్స్ చేయడం శాస్త్రవేత్తలకు తప్పనిసరి అవుతోంది. చిన్నపాటి మందులకు ఎలుకలు సరిపోయినా, పెద్ద వ్యాధుల పరిశోధనలకు మాత్రం ఈ ప్రైమేట్స్ అవసరం ఎంతో ఉంది.
సప్లై తక్కువ.. డిమాండ్ ఎక్కువ
చైనాలో మెడికల్ రీసెర్చ్ ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గణాంకాల ప్రకారం చైనాలో 5,215 క్లినికల్ డ్రగ్ ట్రయల్స్ నమోదు కాగా, అందులో దాదాపు 57.5 శాతం పూర్తిగా సరికొత్త ఔషధాల పరిశోధనలే కావడం విశేషం. ఇది గత ఐదేళ్లతో పోలిస్తే రెండింతలు ఎక్కువ. గ్లోబల్ ఫార్మా కంపెనీలు సైతం చైనా బయోటెక్ కంపెనీలతో భారీ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. అయితే పరిశోధనల వేగం పెరిగినప్పటికీ, దానికి తగ్గట్టుగా కోతుల సరఫరా పెరగడం లేదు. ఎందుకంటే ల్యాబ్‌లో ప్రయోగానికి పనికొచ్చే ఒక కోతిని సిద్ధం చేయడానికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. కోతి జననం, దాని పెంపకం, కఠినమైన ఆరోగ్య పరీక్షలు, ఇన్ఫెక్షన్లు లేవనే సర్టిఫికేషన్ వంటి ప్రక్రియల వల్ల డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై వెంటనే పెంచడం సాధ్యం కావడం లేదు.
కరోనా కాలం నాటి ఆంక్షలే శాపమా?
గతంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో చైనా ప్రభుత్వం ల్యాబ్ కోతుల ఎగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. దీనివల్ల అంతర్జాతీయంగానే కాకుండా చైనా స్థానిక మార్కెట్లోనూ వీటి లభ్యత దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం అందుతున్న అంచనాల ప్రకారం చైనాలో ఏటా సుమారు 49 వేల నుంచి 52 వేల లోపు ల్యాబ్ కోతులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. కానీ బయోటెక్ రీసెర్చ్ ఉధృతిని బట్టి చూస్తే చైనాకు ప్రతి ఏటా కనీసం 10 వేల కోతుల కొరత వేధిస్తోంది. ఈ కారణంగానే అనేక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు కోతుల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫలితంగా ఈ కోతులు కేవలం శాస్త్రీయ ప్రయోగ వస్తువులుగానే కాకుండా అత్యంత విలువైన బయోలాజికల్ అసెట్ గా మారిపోయాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నా తగ్గని జంతువుల ప్రాధాన్యత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జంతువులపై చేసే ప్రయోగాలను తగ్గించాలని జంతు ప్రేమికులు, శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆర్గన్-ఆన్-చిప్, త్రీడీ సెల్ కల్చర్, అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ మోడల్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నారు. జంతువులపై ఆధారపడకుండా మందుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నప్పటికీ, పూర్తిస్థాయి సంక్లిష్ట ఇమ్యునాలజీ మందుల విషయంలో వీటికి పరిమితులు ఉన్నాయి. జీవమున్న ప్రాణి శరీరంలో మందు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇప్పటికీ కోతుల శరీరమే ఏకైక ప్రత్యామ్నాయంగా ఉంది. అందువల్ల రాబోయే కొన్నేళ్ల పాటు చైనా ఫార్మా రంగంలో ఈ ల్యాబ్ కోతులకు డిమాండ్, వాటి ధరలు ఇలాగే రేసు గుర్రాల్లా దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.




