China Oil Stockpile: చైనా పవర్‌ పాలిటిక్స్ః ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అలర్ట్‌

China Oil Stockpile: చైనా నేడు సూపర్‌ పవర్‌గా ఆవిర్భవించింది అంటే దానికి ప్రధాన కారణం ముందుచూపే. అమెరికా ఇరాన్‌ మధ్య మేఘాలు కమ్ముకోకముందే చైనా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

Balachander
Published on: 24 April 2026 3:12 PM IST
China Oil Stockpile
X

China Oil Stockpile

China Oil Stockpile: చైనా నేడు సూపర్‌ పవర్‌గా ఆవిర్భవించింది అంటే దానికి ప్రధాన కారణం ముందుచూపే. అమెరికా ఇరాన్‌ మధ్య మేఘాలు కమ్ముకోకముందే చైనా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చమురును ఇరాన్‌ నుంచి భారీగా దిగుమతి చేసుకుంది. ఇరాన్‌తో పాటు అటు రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు దిగుమతి చేసుకొని భారీగా నిల్వ చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో 32 దేశాల వద్ద ఉన్న మొత్తం చమురు నిల్వల కంటే చైనా వద్ద ఉన్న చమురు నిల్వలు అధికమని నిపుణులు చెబుతున్నారు. చైనా మరోసారి భౌగోళిక రాజకీయాల్లో పట్టును నిరూపించుకుందని అంటున్నారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి సంక్షోభాన్ని నివారించేందుకు చమురును పెద్ద ఎత్తున నిల్వచేసుకున్నది. ఇప్పుడు ఏ దేశంలో చమురు నిల్వలు పెద్ద సంఖ్యలో ఉంటాయో ఆ దేశమే రాజకీయంగా, ఆర్థికంగా పెత్తనం చలాయించేందుకు అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ ముందుండే చైనా ఇప్పుడు ఇంధనం అవసరాల విషయంలో కూడా ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలను అమలు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన 'ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్' స్పష్టం చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక చైనా ఎంతటి భారీ ప్రణాళికతో ఉందో స్పష్టం చేస్తోంది.

చైనా ఆధిపత్యం

ప్రపంచ దేశాల చమురు నిల్వలను పరిశీలిస్తే చైనా దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏలో మొత్తం 32 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ సభ్యదేశాల వద్ద ఉన్న చమురు నిల్వలు 1.2 బిలియన్‌ బ్యారెళ్లు. కానీ, ఒక్క చైనా వద్ద 1.4 బిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉండటం గమనార్హం. చైనా చమురు నిల్వల్లో దూసుకుపోతుంటే... అమెరికా యుద్ధం పేరుతో నిధులను ఖర్చుచేస్తూ చమురును దుబారా చేస్తున్నది. అమెరికా వద్ద కేవలం 413 మిలియన్‌ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉన్నది. అమెరికా కంటే చైనా వద్ద మూడు రెట్లు అధికం అని చెప్పాలి.

ట్రంప్ ప్రభావం.. చైనా వేగం

చైనా 2025 నుంచే చమురును నిల్వ చేసుకోవడంలో వేగాన్ని పెంచింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్‌. రెండోసారి అధికారంలోకి వస్తే ట్రంప్‌ సృష్టించే అలజడులను చైనా ముందుగానే అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతాయని భావించింది. ఇరాన్‌పై దాడి చేస్తారని గుర్తించి దిగుమతులను భారీగా పెంచుకుంది. గణాంకాల ప్రకారం 2025 జనవరి ఫిబ్రవరితో పోలిస్తే 2026 ప్రారంభ నెలల్లో చైనా దిగుమతులు 15.8 శాతం పెరిగింది. యుద్ధం కారణంగా చమురు రవాణా నిలిచిపోయినా... ప్రపంచ దేశాల్లో చమురు ధరలు పెరిగినా చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.

భారత్‌ ఆహార నిల్వలను ఎలా పెంచుకుంటూ పోతున్నదో చైనా చమురు నిల్వలను ఆవిధంగా పెంచుకుంటోంది. ఈ చర్యతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో చైనా కింగ్‌మేకర్‌గా మారిపోయింది. ఇప్పటికిప్పుడు ప్రపంచదేశాలపై ఆంక్షలు విధించినా... ఎలాంటి యుద్ధాలు జరిగినా కొన్నేళ్లపాటు ఇంధన కొరత రాదని చైనా భావిస్తోంది. ఎలాగైనా చైనాని అణగదొక్కాలని చూస్తున్న అమెరికాకు ఇదొక సవాల్‌ అని చెప్పాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story