Tianlong-3 Rocket Failure: చైనా ఆయుధాలే కాదు...రాకెట్లు కూడా తుస్సే

పశ్చిమాసియా యుద్ధ సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో ఇరాన్‌ నానా అవస్థలు పడింది. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఘోరంగా విఫలం కావడంతో పెద్ద ఎత్తున జరిగిన దాడులకు బలికావలసి వచ్చింది.

Balachander
Published on: 4 April 2026 12:24 PM IST
Tianlong-3 Rocket Failure
X

Tianlong-3 Rocket Failure: చైనా ఆయుధాలే కాదు...రాకెట్లు కూడా తుస్సే

Tianlong-3 Rocket Failure : పశ్చిమాసియా యుద్ధ సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో ఇరాన్‌ నానా అవస్థలు పడింది. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఘోరంగా విఫలం కావడంతో పెద్ద ఎత్తున జరిగిన దాడులకు బలికావలసి వచ్చింది. అంతేకాదు, పాకిస్తాన్‌ కూడా చైనా ఆయుధాలతో, చైనా ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో నానా తంటాలు పడుతోంది. చైనా ఆయుధాలంటే ప్రపంచంలో ఒకవిధమైన భయం నెలకొంది. చైనా వస్తువుల మాదిరిగానే ఆయుధాలు కూడా నాణ్యత లేకుండా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియకుండా పోయింది. ఇక్కడితో చైనా వైఫల్యం పూర్తికాలేదు. ఇది అంతరిక్షానికి కూడా చేరింది.

చైనా రాకెట్‌ తియాన్‌లాంగ్-3 విఫలం

అంతరిక్ష రంగంలో గట్టి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న చైనాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంతో పాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తోంది చైనా. కానీ, ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు తాజా ఉదాహరణగా స్పేస్‌ పయనీర్‌ సంస్థ చేపట్టిన తియాన్‌లాంగ్‌ 3 రాకెట్‌ పరీక్షగా నిలిచింది. ఏప్రిల్ 3న నిర్వహించిన ఈ ప్రయోగం సాంకేతిక లోపంతో విఫలమవడం అంతరిక్ష రంగంలో చర్చనీయాంశంగా మారింది. తియాన్‌లాంగ్-3 రాకెట్‌ను అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఫాల్కన్ 9కు పోటీగా రూపొందించారు. భారీ పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం మాత్రమే కాకుండా, తిరిగి భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యే పునర్వినియోగ టెక్నాలజీ ఈ రాకెట్ ప్రత్యేకత. ఈ లక్ష్యంతో డాంగ్‌ఫెంగ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ సెంటర్ నుంచి ప్రయోగించిన రాకెట్, ప్రారంభంలో సాఫీగా సాగినప్పటికీ...కొంత సమయం తరువాత అదుపుతప్పింది.

క్షమాపణలు చెప్పిన పయనీర్‌

రాకెట్‌ ప్రయాణంలో మొదటిదశ విడిపోవడంలో లోపం లేదా ఇంజిన్‌ పనితీరులో సమస్య తలెత్తినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణంగానే రాకెట్‌ నిర్దేశిత కక్ష్యను చేరుకోలేపోయిందని అంటున్నారు. సాధారణంగా ఈ తరహా ప్రయోగాల్లో ప్రతి దశ ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎలాంటి చిన్న లోపం జరిగినా దాని ప్రభావం మిషన్‌పై పడుతుంది. అయితే, ఈ వైఫల్యంపై స్పేస్‌ పయనీర్‌ సంస్థ స్పందించింది. తొలి ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరమని తెలిపింది. భవిష్యత్తులో మెరుగైన సాంకేతికతతో ప్రయోగాలు చేపడతామని తెలియజేసింది. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌లో పోటీ భారీగా ఉంది. వాణిజ్య ప్రయోగాల్లో అధిక భాగస్వామ్యం పొందేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేట్‌ రంగానికి మద్దతు ఇస్తున్నది. తొలిప్రయత్నం విఫలం అని చెబుతున్నా...ప్రపంచ మార్కెట్లో చైనా వస్తువులపై ఉన్న అపనమ్మకం ఉండటంతో రాకెట్లు కూడా అలాంటివేనని సోషల్‌ మీడియాలో చురకలు అంటిస్తున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story