US Iran War : అమెరికా చెప్పిన దానికంటే ఎక్కువ నష్టం.. ఇరాన్ దాడులపై చైనా సంచలన నివేదిక

US Iran War : శాటిలైట్ చిత్రాల ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు.

CR Reddy
Published on: 30 July 2026 7:10 AM IST
US Iran War
X

 US Iran War 

US Iran War : మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, అమెరికా బలగాల మధ్య జరిగిన యుద్ధ వాతావరణంపై చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక సంచలన పరిశోధనా నివేదికను విడుదల చేశారు. యూఎస్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల వల్ల జరిగిన అసలు నష్టంపై చైనా అధ్యయనం చేసింది. అమెరికా ప్రభుత్వం చెప్పుకున్నట్లు అక్కడ నష్టం చాలా తక్కువగా ఏమీ జరగలేదని, అయితే అదే సమయంలో ఇరాన్ ప్రచారం చేసినంత భారీ స్థాయిలో కూడా లేదని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జులై 7న ది ఇన్నోవేషన్ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది.

సెంటినెల్-2 ఉపగ్రహ చిత్రాలతో నష్టం అంచనా

ఈ రీసెర్చ్ కోసం చైనా శాస్త్రవేత్తలు యురోపియన్ యూనియన్‌కు చెందిన సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా సేకరించిన 10-మీటర్ల రిజల్యూషన్ చిత్రాలను విశ్లేషించారు. ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 మధ్య మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన దాడులకు ముందు, తరువాతి పరిస్థితులను వారు నిశితంగా పరిశీలించారు. అడ్వాన్స్‌డ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సహాయంతో దాదాపు 2,17,900 చదరపు మీటర్ల వైశాల్యంలో తీవ్రమైన నష్టం జరిగినట్లు చైనా బృందం గురించింది.

కీలక ఎయిర్ బేస్‌లు, హ్యాంగర్లపై పడిన దెబ్బ

కువైట్‌లోని అలీ అల్ సేలమ్ ఎయిర్ బేస్‌పై అత్యధికంగా 20 స్ట్రైక్ పాయింట్లను గుర్తించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన MQ-9 రీపర్ డ్రోన్లు, U-2 గూఢచారి విమానాలను ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు నివేదిక పేర్కొంది. అలాగే బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీకి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయ సముదాయం కూడా దెబ్బతిన్నట్లు స్పష్టమైంది. ఈ దాడులు రెండు విడతల్లో జరిగాయని, తొలి రోజునే 58,600 చదరపు మీటర్ల మేర నష్టం వాటిల్లగా, మార్చి 15న జరిగిన రెండో విడత దాడిలో మరో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ధ్వంసమైందని తెలిపారు.

నిజమైన నష్టం ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం

ఈ నివేదికలో ఉపయోగించిన ఉపగ్రహ చిత్రాల పరిమితుల కారణంగా చిన్న చిన్న నష్టాలు రికార్డు కాలేదని, కాబట్టి నిజమైన నష్టం ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏప్రిల్ 4న అమెరికా కొన్ని కమర్షియల్ సాటిలైట్ కంపెనీలపై నిషేధాలు విధించి హై-రిజల్యూషన్ చిత్రాలు బయటకు రాకుండా నియంత్రించిందని కూడా చైనా బృందం ఆరోపించింది. వరుస దాడులతో అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వెంటనే కోలుకోలేకపోయాయని, ఎయిర్-డిఫెన్స్ క్షిపణులను లోడ్ చేసుకోవడానికి, పాడైన రాడార్లను రిపేర్ చేసుకోవడానికి యూఎస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story