బంగ్లా మురికివాడలకు ఢిల్లీ రంగు.. చైనా వ్లాగర్ల ఫేక్ ప్రచారం
Chinese Vloggers: సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్ల కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. తాజాగా చైనాకు చెందిన కొందరు వ్లాగర్లు చేసిన నిర్వాకం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
బంగ్లా మురికివాడలకు ఢిల్లీ రంగు.. చైనా వ్లాగర్ల ఫేక్ ప్రచారం
Chinese Vloggers: సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్ల కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. తాజాగా చైనాకు చెందిన కొందరు వ్లాగర్లు చేసిన నిర్వాకం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని పేదరిక ప్రాంతాల్లో వీధుల్లో తిరుగుతూ లైవ్ ఇస్తున్న కొందరు చైనా జాతీయులు.. ఆ ఫుటేజీని ఏకంగా 'ఇండియాలోని న్యూఢిల్లీ' దృశ్యాలంటూ చైనా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. భారత్‌ను తక్కువ చేసి చూపడంతో పాటు, అక్కడి దైన్యస్థితిపై ఇష్టానుసారంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.
ఢాకా వీధుల్లో చైనా వ్లాగర్ల హైడ్రామా
బంగ్లాదేశ్ ప్రముఖ మీడియా సంస్థ 'ప్రథమ్ ఆలో' నిర్వహించిన ప్రత్యేక దర్యాప్తులో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని టెక్‌పారా, ఉత్తరా తదితర మురికివాడల్లో దాదాపు 150 మందికి పైగా చైనా జాతీయవాదులు తిరుగుతూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రతి వ్లాగర్ చేతిలోనూ రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఒక దాంతో లైవ్ చేస్తుండగా, మరొక దాంతో చాట్ చదవడం లేదా సమాచారాన్ని పరిశీలించడం చేస్తున్నారు. అయితే, తాము బంగ్లాదేశ్‌లో ఉన్నామని చెప్తూ.. వీయూవర్స్‌ను మాత్రం ఇది "న్యూఢిల్లీ" అని నమ్మిస్తున్నారు.
"ఇదే న్యూఢిల్లీ.. ఇళ్లన్నీ మురికిగా ఉన్నాయి"
ఈ చైనా భాషా లైవ్‌లను గూగుల్ ట్రాన్స్లేటర్ సహాయంతో చైనీస్ తెలిసిన నలుగురు బంగ్లాదేశీయులు పరిశీలించగా విస్తుపోయే నిజాలు తెలిసాయి. నవంబర్ 1న 'మియాన్మియాన్' అనే చైనా మహిళ టెక్‌పారాలోని కాలువ ఒడ్డు నుంచి లైవ్ ఇస్తూ.. "ఇదే న్యూఢిల్లీ. వీళ్ల ఇళ్లు చాలా మురికిగా ఉన్నాయి. రేకుల ఇళ్లలో కనీసం ఫ్యాన్లు కూడా లేవు" అంటూ అక్కడి జీవన విధానాన్ని తీవ్రంగా అవమానించేలా మాట్లాడింది. మరో వ్యక్తి వాంగ్ వీ ఒక టీ దుకాణం దగ్గర వీడియో తీస్తూ.. "ఇదిగో వీళ్లు టీ తాగుతున్నారు. ఇదెంటో తెలుసా? ఆవు మూత్రంతో చేసే టీ" అంటూ అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా మురికి నది నీటితోనే ఈ టీ చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశాడు. అయితే, కొందరు మాత్రం అక్కడి భవనాల్లో ఉన్న చైనా ఏసీలను చూపిస్తూ ప్రమోట్ చేయడం గమనార్హం.
స్థానికుల ఇళ్లలోకి చొరబడి ప్రైవసీకి భంగం
ఈ ఫేక్ ప్రచారం కేవలం వీధులకే పరిమితం కాలేదు. కొందరు చైనా వ్లాగర్లు ఏకంగా స్థానికుల ఇళ్లలోకి, చివరకు బాత్రూమ్‌లలోకి కూడా ఎలాంటి అనుమతి లేకుండా చొరబడి వీడియోలు రికార్డు చేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "మేము ఇంట్లో సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఉన్న సమయంలో సడన్‌గా వచ్చి వీడియోలు తీస్తున్నారు. ప్రశ్నిస్తే నవ్వి క్షమాపణ చెప్పి వెళ్లిపోతున్నారు" అని రోజినా ఖాతూన్, పాపియా బేగం అనే స్థానిక మహిళలు వాపోయారు.
ఈ వ్లాగర్లకు సహాయం చేయడానికి కొందరు స్థానిక మహిళలు రోజుకు రూ. 700 నుంచి రూ. 800 తీసుకుంటూ గైడ్లుగా పనిచేస్తున్నట్లు తేలింది. వీచాట్, డౌయిన్ (చైనా టిక్‌టాక్) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ వీరు డబ్బు సంపాదిస్తున్నారు. అయితే, బంగ్లాదేశ్‌ను ఎందుకు భారత్‌గా చిత్రీకరిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటనే దానిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, భాషా సమస్య కారణంగా పూర్తి వివరాలు రాబట్టలేకపోతున్నారు. డిజిటల్ ప్రైవసీని కాలరాస్తూ, తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




