Congo Ebola Outbreak: కాంగోలో సరికొత్త ముప్పు...అంతర్గత యుద్ధంతో ప్రాణాంతకంగా మారుతున్న ఎబోలా
కాంగోలో అంతర్యుద్ధం కారణంగా ఎబోలా కొత్త వేరింట్ పుట్టుకొచ్చింది. సాధారణ వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ మరింత ప్రాణాంతకం.
Congo Ebola Outbreak: అంతర్యుద్దాలు, ఆకలికేకతలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఎబోలా వైరస్ వణికిస్తోంది. కాంగోలోని ఇటూరి ప్రాంతంలో...ముఖ్యంగా మొంగ్బ్వాలు అనే మైనింగ్ పట్టణ కేంద్రంగా అత్యంత ప్రమాదకరమైన బుందిబుగ్యో అనే ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఒకవైపు వైరస్ వ్యాపిస్తుంటే మరోవైపు అంతర్గత యుద్ధంతో కాంగో అట్టుడికి పోతున్నది. దీంతో ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు శరణార్థ శిభిరాల్లో తలదాచుకోవడం ఇప్పుడు మరో ముప్పుగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఒకేచోట కలిసి ఉండటంతో ఎబోలా వైరస్ మ్యూటేషన్ జరిగి సరికొత్త ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
టీకా మరియు చికిత్స లేని సరికొత్త వేరియంట్
సాధారణంగా ఎబోలా వ్యాధికి కారణం జైర్ అనే వేరియంట్. దీనికోసం ప్రపంచంలో ఇప్పటికే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రస్తుతం కాంగోలో విజృంభిస్తునన బుందిబుగ్యో వేరియంట్ అత్యంత అరుదైనది. దీనిని వేగంగా గుర్తించేందుకు అవసరమైన డయాగ్నోస్టిక్ కిట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఆమోదయోగ్యమైన చికిత్సగాని, వ్యాక్సిన్‌గాని ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రికా వ్యాధి నియంత్రణ కేంద్రం ప్రకారం 2026 చివరి నాటికి ఈ వేరియంట్‌కి సంబంధించిన టీకా అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో సుమారు 25 శాతం నుంచి 40 శాతం వరకు మరణాల రేటు ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రారంభదశలో జ్వరం, వాంతులు, విరేచనాల రూపంలో వ్యాధి ఉంటుందని, చివరి దశలో అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరుగుతుందని, తద్వారా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మైనింగ్ మాఫియా, అంతర్గత యుద్ధం
ఈ మహమ్మారి విజృంభణ వెనుక కాంగోలోని సహజ వనరుల వేట ఒక ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దట్టమైన అడవుల్లో బంగారం, టాంటాలమ్, టంగ్‌స్టన్ వంటి విలువైన ఖనిజాల కోసం అక్రమంగా మైనింగ్ చేసే కార్మికులు, అడవి జంతువుల మాంసం తినడం వల్లే ఈ జూనోటిక్ వైరస్ బయటపడింది. కాంగోలో ఇప్పటికే ఇటువంటి కేసులు సుమారు వెయ్యికి పైగా నమోదయ్యాయి. రోజురోజుకు అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇక ఈ వైరస్ కారణంగా వందలాదిమంది మరణించారు. ఇందులో వైద్యసిబ్బంది కూడా ఉన్నట్టుగా చెబుతున్నారు. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ మొంగ్బ్వాలులో 60 పడకల ప్రత్యేక ఎబోలా చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం చికిత్సను అందిస్తోంది.
అంతర్జాతీయ ఆంక్షలు... స్థానికుల తిరుగుబాటు
ఇక ఈ వైరస్ కాంగో నుంచి పొరుగు దేశాలైన ఉగాండా, రువాండా దేశాలకు కూడా వ్యాపించడంతో తాత్కాలికంగా బోర్డర్‌ను మూసివేశాయి. ఇక అంతర్జాతీయంగా పలుదేశాలు విమానాశ్రయాల్లో కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. త్వరలో జరగబోయే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌పై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి రోజు రోజుకు విస్తరిస్తోంది. అంతేకాదు, ఇటీవల స్థానికులు మొంగ్బ్వాలు జనరల్ ఆసుపత్రిపై దాడి చేసి నిప్పు పెట్టారు. విదేశీయులే తమ దేశానికి ఈ వ్యాధిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో 18 మంది ఎబోలా రోగులు ఆసుపత్రి నుంచి తప్పించుకొని అడవుల్లోకి పారిపోయారు. ఇక్కడ వైద్యం ఒక్కటే అందిస్తే సరిపోదని, తుపాకుల మోత ఆగి స్థానిక ప్రజల్లో నమ్మకం కలిగినపుడే ఈ ముప్పునుంచి దేశం బయటపడుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.




