Global tech outage: ఆపిల్ నుంచి అమెరికా రహస్య నెట్‌వర్క్ దాకా స్తంభించిన సేవలు!
Global tech outage: ప్రపంచవ్యాప్తంగా పలు కీలక డిజిటల్ సేవలకు భారీ అంతరాయం కలిగింది.
Global tech outage: ఆపిల్ నుంచి అమెరికా రహస్య నెట్‌వర్క్ దాకా స్తంభించిన సేవలు!
Apple services down: మనం రోజూ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యాప్‌ల నుంచి ప్రపంచాన్ని శాసించే అత్యంత రహస్య భద్రతా వ్యవస్థల వరకు ఒక్కసారిగా సాంకేతిక గ్రహణం పట్టుకుంది. మంగళవారం ప్రపంచవ్యాప్తంగా పలు కీలక డిజిటల్ సేవలు కుప్పకూలడం టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించింది.
ఒకవైపు సాఫ్ట్‌వేర్ లోపాలతో ఆపిల్, అమెరికా జాతీయ భద్రతా సంస్థ సేవలకు అంతరాయం కలగగా, మరోవైపు 178 దిగ్గజ సంస్థల వెబ్‌సైట్లలో హానికరమైన కోడ్ చొరబడటం సైబర్ భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
టెక్ దిగ్గజం ఆపిల్‌కు చెందిన ఐక్లౌడ్, యాప్ స్టోర్, ఆపిల్ పే, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ సపోర్ట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కొత్త డివైజ్‌లను యాక్టివేట్ చేసుకోలేక, ఖాతాల్లోకి లాగిన్ కాలేక యూజర్లు అయోమయానికి గురయ్యారు.
అమెరికాతో పాటు బ్రెజిల్, గ్రీస్, లాట్వియా దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే, ఇది సైబర్ దాడి కాదని, తమ అంతర్గత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగానే ఈ సాంకేతిక సమస్య తలెత్తిందని ఆపిల్ స్పష్టం చేసింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా జాతీయ భద్రతా సంస్థ రహస్య కమ్యూనికేషన్ల నెట్‌వర్క్ NSA నెట్‌లోనూ మంగళవారం తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. సాధారణ నిర్వహణ పనుల సమయంలో తలెత్తిన లోపం వల్ల ఉద్యోగుల అంతర్గత సమాచార మార్పిడికి ఆటంకం కలిగింది. జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చినప్పటికీ, అత్యవసరం కాని సిబ్బంది విధులకు వచ్చే సమయాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది.
ఒకవైపు సాంకేతిక లోపాలు వేధిస్తుంటే, మరోవైపు సైబర్ నేరగాళ్లు భారీ దాడికి తెగబడ్డారు. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ ప్లాట్‌ఫామ్ ఆప్టిమైజ్లీలోని ఓ లోపాన్ని ఆసరాగా చేసుకుని, ఏకంగా 178 సంస్థల వెబ్‌సైట్లలో హానికరమైన జావాస్క్రిప్ట్ కోడ్‌ను చొప్పించారు.
జూమ్ , హెచ్‌ఎస్‌బీసీ , సీఎన్‌ఎన్, సేల్స్‌ఫోర్స్, ఐకియా, ఈక్విఫాక్స్ వంటి ప్రముఖ సంస్థల సైట్లు ఈ జాబితాలో ఉన్నట్లు భద్రతా పరిశోధకుడు స్కాట్ హెల్మ్ గుర్తించారు.వినియోగదారుల క్రిప్టోకరెన్సీ, పేమెంట్ వివరాలు, కుకీలు, స్క్రీన్‌షాట్‌లను దొంగిలించడంతో పాటు ఐఫోన్లను లక్ష్యంగా చేసుకునేలా ఈ కోడ్‌ను రూపొందించారు.
ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న సాంకేతిక వైఫల్యాలు డిజిటల్ వ్యవస్థల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. మంగళవారం మారియట్ ఇంటర్నేషనల్ హోటళ్లలో చెక్-ఇన్, రిజర్వేషన్ సేవలు నిలిచిపోయాయి.
సోమవారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో 90 నిమిషాల పాటు సిస్టమ్స్ ఆగిపోవడంతో విమానాలు ఆలస్యమయ్యాయి. అంతకుముందు FAA నెట్‌వర్క్ లోపంతో వందలాది విమానాలకు ఆటంకం కలిగింది.ఇటీవలే చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో ఆన్‌లైన్ సేవలు, జెల్లే మనీ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి.
గత వారం మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ పనిచేయక ఆసుపత్రులు, ఫెడరల్ కోర్టుల కార్యకలాపాలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఆపిల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, బ్యాంకుల నుంచి ప్రభుత్వ నిఘా సంస్థల వరకు ఒకే తరహా సాంకేతిక వేదికలపై ఆధారపడుతుండటం పెను సవాలుగా మారింది.
చిన్నపాటి సాఫ్ట్‌వేర్ లోపం లేదా సైబర్ దాడి జరిగితే చాలు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలు, వ్యాపార కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఈ వరుస ఘటనలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి.




