Covid 19 : చైనాలో మళ్లీ కరోనా కలకలం.. మళ్లీ ప్రపంచమంతా లాక్ డౌన్ తప్పదా ?
Covid 19 : చైనాలో కొత్త ఓమిక్రాన్ వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఊహాన్ నాటి పరిస్థితులు లేవని, భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు చెప్తున్నారు.
Covid 19
Covid 19 : చైనాలో కరోనా వైరస్ మరొకసారి కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో అక్కడ కోవిడ్ ఇన్ఫెక్షన్లు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈసారి పరిస్థితి 2020లో మొదలైన వూహాన్ నాటి భయానక మహమ్మారి లాగా లేదని చైనా ఆరోగ్య అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ బాధితుల్లో ఎక్కువ మందికి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన తీవ్రమైన కేసులు చాలా తక్కువగా ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ NB.1.8.1 కలకలం
చైనా సీడీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌కు చెందిన NB.1.8.1 అనే కొత్త వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. జూన్ నెలలోనే అక్కడ దాదాపు 79,000 కొత్త కేసులు నమోదయ్యాయి. జులై రెండో వారంలో నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 12% నుంచి ఏకంగా 16.3% కి పెరిగింది. అదే సమయంలో ఇన్ఫ్లుఎంజా పాజిటివిటీ రేటు 12.6% కి పడిపోయింది. దీనిబట్టి ఈ ఏడాదిలో మొదటిసారిగా ఫ్లూని దాటుకుని కరోనా వైరస్ ఎక్కువమందికి వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్‌గా మారింది. బాధితుల్లో ఎక్కువగా జ్వరం, గొంతు నొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తుండగా, 5 నుంచి 7 రోజుల్లో కోలుకుంటున్నారు.
వేసవి సెలవులు, ఎయిర్ కండిషన్ల ప్రభావం
వైరస్ ఇంత వేగంగా వ్యాపించడానికి కొన్ని ప్రధాన కారణాలను నిపుణులు విశ్లేషించారు. వేసవి కాలంలో తీవ్రమైన వేడి కారణంగా ప్రజలు ఎక్కువ సమయం ఎయిర్ కండిషన్ ఉన్న మూసివున్న గదుల్లో గడపడం, సెలవుల వల్ల ప్రయాణాలు పెరగడం దీనికి ముఖ్య కారణాలని చెబుతున్నారు. అయితే గత ఏడాది మే 2025 లో నమోదైన 20% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటుతో పోలిస్తే ప్రస్తుత కేసులు చాలా తక్కువగానే ఉన్నాయి. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల, పాత ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చిన ఇమ్యూనిటీ సమయం గడిచేకొద్దీ తగ్గడం సహజమని, అందుకే ఈ చిన్నపాటి వేవ్‌లు వస్తుంటాయని వైద్యులు అంటున్నారు.
భారత్‌కు ఎంతవరకు ప్రమాదం?
ప్రస్తుతానికి చైనాలోని ఈ పరిస్థితుల వల్ల భారతదేశం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చైనాలో వ్యాపిస్తున్న NB.1.8.1 వేరియంట్ గతంలో లాగా ప్రాణాపాయం కలిగించేంత తీవ్రమైంది కాదని ప్రాథమిక డేటా చెప్తోంది. భారత్‌లో కూడా దీనికి సంబంధించి ఎలాంటి అసాధారణ హెచ్చరికలు జారీ కాలేదు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చైనాలో కేసులు పెరిగినా ఊహాన్ తరహా సంక్షోభం వచ్చే అవకాశాలు లేనట్లేనని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




