Cuba Defies US Pressure: క్యాస్ట్రో పుట్టిన గడ్డ...చె గువేరా పోరాడిన నేల...అమెరికాకు లొంగేదిలేదు

విశ్వాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చరిత్ర క్యూబా సొంతం.

Balachander
Published on: 19 May 2026 1:07 PM IST
Cuba Defies US Pressure:  క్యాస్ట్రో పుట్టిన గడ్డ...చె గువేరా పోరాడిన నేల...అమెరికాకు లొంగేదిలేదు
X

Cuba Defies US Pressure: విశ్వాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చరిత్ర క్యూబా సొంతం. ఫిడేల్ క్యాస్ట్రో అసమానమైన పోరాటం, చే గువేరా గెరిల్లా యుద్ధ వీరత్వంతో నాడు అమెరికా బలగాలను మట్టికరిపించిన ఈ చిన్న ద్వీపదేశం.. నేడు మరోసారి అమెరికా సైనిక బెదిరింపుల సవాల్‌ను ఎదుర్కొంటోంది. తమ దేశంపై దాడికి దిగితే ఊహించని రీతిలో "రక్తపాతం" తప్పదని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డయాజ్-కానెల్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. వందలాది ఆంక్షలతో తమ ఆర్థిక వ్యవస్థను గొంతు నులిమినా, అగ్రరాజ్యం ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని క్యూబా ప్రజలు మరోసారి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ప్రస్తుతం క్యూబా-అమెరికా సరిహద్దుల్లో రేగుతున్న ఈ యుద్ధ జ్వాలల వెనుక ఉన్న అసలు నిజానిజాలను విశ్లేషణాత్మక కోణంలో తెలుసుకుందాం.

డ్రోన్ల వ్యూహం.. అగ్రరాజ్యంలో వణుకు

రష్యా, ఇరాన్ దేశాల నుండి క్యూబా సుమారు 300లకు పైగా అత్యాధునిక సైనిక డ్రోన్లను సేకరించిందని, వాటిని అమెరికా లక్ష్యాలపై ప్రయోగించడానికి సిద్ధం చేస్తోందని అంతర్జాతీయ నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈస్టర్న్ క్యూబాలోని అమెరికా సైనిక స్థావరం గువాంటనామో బే, అలాగే అమెరికా నౌకలు, ఫ్లోరిడా తీరాలపై క్యూబా డ్రోన్ దాడులకు ప్రణాళికలు రచిస్తోందనే వార్త వాషింగ్టన్‌ను ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై స్పందించిన క్యూబా అధ్యక్షుడు.. తాము ఎవరికీ ముప్పు కాదని, అయితే తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తామని, ఆత్మరక్షణ హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు క్యూబా ఎవరితోనూ యుద్ధం చేయలేదు...క్యూబా జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టలేదు. కార్పోరేట్‌ కబంద హస్తాల నుంచి క్యూబాను రక్షించుకున్న వీరులు భూమిపై లేకున్నా...వారి అనునయులు, వారి వారసులు, వారిని అభిమానించేవారు, అవసరమైతే పోరాటం చేసేందుకు వెనకడుగు వేయనివారు దేశంలో ఉన్నారని క్యూబా ప్రజలు చెబుతున్నారు.

60ల నాటి పరాభవాన్ని గుర్తు చేసిన క్యూబా

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం క్యూబా ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో పాటు, ఆ దేశ కమ్యూనికేషన్స్, ఎనర్జీ, జస్టిస్ మంత్రులు సహా 9 మంది కీలక నేతలపై ఆంక్షలు విధించింది. అంతేకాదు, దిగ్గజ విప్లవ వీరుడు ఫిడేల్ క్యాస్ట్రో సోదరుడు, 94 ఏళ్ల వృద్ధుడు రావుల్ క్యాస్ట్రోపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. దీనిపై ఐక్యరాజ్యసమితిలో క్యూబా రాయబారి ఎర్నెస్టో సోబెరాన్ గుజ్మాన్ ధీటుగా బదులిచ్చారు. "1960 కాలంలో మా దేశాన్ని ఆక్రమించాలని చూసిన అమెరికాకు ఘోర పరాభవం ఎదురైంది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారినా, క్యూబా ప్రజల పోరాట పటిమ, దృఢ సంకల్పం అస్సలు మారలేదు" అని హెచ్చరించారు.

లొంగదీసుకునేందుకు చమురు దిగ్బంధం

క్యూబాను లొంగదీసుకోవడానికి అమెరికా ఒక కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆ దేశానికి ప్రధాన ఇంధన సరఫరాదారు అయిన వెనిజులా నుండి వచ్చే చమురు నౌకలను అడ్డుకుంది. ఈ ఆర్థిక దిగ్బంధం వల్ల క్యూబాలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం, డీజిల్ కొరత ఏర్పడ్డాయి. అయినప్పటికీ, క్యూబాకు మిత్రదేశాల మద్దతు లభిస్తోంది. ఇటీవల మెక్సికో దేశం నుండి రష్యా సాయంతో 1,700 టన్నుల మానవతా సాయం మోసుకెళ్లే పనామా జెండాతో నౌక క్యూబా తీరానికి చేరింది. క్యూబా అంటే కేవలం ఒక దేశం కాదు, అణచివేతపై తిరగబడిన ఒక విప్లవ భావజాలం. ఎన్ని వందల ఆర్థిక ఆంక్షలు విధించినా, ఆకలితో అలమటించినా... క్యాస్ట్రో, చే గువేరా నడయాడిన ఆ నేల అమెరికాకు లొంగేది లేదని సగర్వంగా నిలబడి నిరూపిస్తోంది. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా క్యూబా చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకొని నిలబడితే...సమస్యలు దూరమౌతాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story