Earthquake: టిబెట్, చైనాలలో భారీ భూకంపం.. 45 నిమిషాల్లో ముడుసార్లు కంపించిన భూమి

Earthquake: ఉత్తర టిబెట్ రీజియన్‌లోని నాగ్చు నగరాన్ని రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన వినాశకర భూకంపం కోలుకోలేని దెబ్బతీసింది.

CR Reddy
Published on: 23 Oct 2026 7:15 AM IST
Tibet Earthquake
X

Tibet Earthquake

Earthquake: ఉత్తర టిబెట్ రీజియన్‌లోని నాగ్చు నగరాన్ని రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన వినాశకర భూకంపం కోలుకోలేని దెబ్బతీసింది. ఈ దెబ్బకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపిన సమాచారం ప్రకారం నాగ్చు నగరంలో సుమారు 339 ఇళ్లు, 20 పశువుల షెడ్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రమాద తీవ్రతను గుర్తించిన స్థానిక యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేసింది. బాధితులను కాపాడేందుకు 1,600 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితుల కోసం 1,000 తాత్కాలిక గృహాలు, 3,000 అత్యవసర టెంట్లు, మడత మంచాలు, టార్చ్ లైట్లు, చలి దుస్తులు విమానాల ద్వారా ఘటనా స్థలానికి తరలించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు కొంత విఘాతం కలుగుతోందని, ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేస్తూ రైళ్ల రాకపోకలను సైతం ఆపివేసినట్లు చైనా రైల్వే శాఖ వెల్లడించింది.

విరిగిపడిన కొండచరియలు

భూకంప తీవ్రతకు పర్వతాల నుంచి పెద్ద ఎత్తున రాళ్లు, కొండచరియలు విరిగిపడటంతో నేషనల్ హైవే-317 పూర్తిగా మూతపడింది. ప్రస్తుతం రహదారిపై ఉన్న మట్టి, రాళ్లను తొలగించేందుకు బుల్డోజర్లను ఉపయోగిస్తున్నారు. కేవలం ఆపత్కాల వాహనాలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో తీవ్రమైన మంచు తుఫాను వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందికి మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐదేళ్ల కాలంలో నమోదైన అతిపెద్ద భూకంపం

గత ఐదేళ్ల కాలంలో ఈ సరిహద్దు ప్రాంతంలో నమోదైన అత్యంత పెద్ద భూకంపం ఇదేనని చైనా అధికారిక నెట్‌వర్క్ తెలిపింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం భూమికి 18 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు సంభవించాయి. దీని కేంద్రం నాగ్చు నగరానికి తూర్పు-ఈశాన్యంగా 191 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో స్వల్ప వ్యవధిలోనే వరుసగా మూడుసార్లు భూమి కంపిచడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.