సముద్రంలో మృత్యుఘోష.. 109 మంది బలి, 116 మంది గల్లంతు!

Djibouti Boat Accident: ఆఫ్రికా ఖండంలోని జిబౌటి (Djibouti) సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి..

G Krishna
Published on: 11 Oct 2026 9:57 PM IST
Djibouti Boat Accident
X

సముద్రంలో మృత్యుఘోష.. 109 మంది బలి, 116 మంది గల్లంతు!

Djibouti Boat Accident: ఆఫ్రికా ఖండంలోని జిబౌటి (Djibouti) సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు బయలుదేరిన వలసదారుల పడవ సముద్రంలో బోల్తా పడటంతో సుమారు 109 మంది దుర్మరణం చెందారు. మృతిచెందిన వారిలో 15 మంది చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. అక్టోబర్ ఎనిమిది నుంచి తొమ్మిదో తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో జిబౌటిలోని ఒబోక్ (Obock) పట్టణ సమీపంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ వలస సంస్థ (IOM) అధికారికంగా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారితో పాటు మరో 116 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించడంతో ప్రాణనాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

350 మందితో యెమెన్ వైపు ప్రయాణం.. చిన్నారులు సైతం బలి

జిబౌటి తీరం నుంచి దాదాపు 350 మంది వలసదారులతో యెమెన్‌ వైపు వెళ్తున్న ఓ పడవ.. ఒబోక్ తీరానికి ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు వెలికితీసిన 109 మృతదేహాలలో 52 మంది పురుషులు, 42 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు ఐఓఎం స్పష్టం చేసింది. మృతిచెందిన చిన్నారుల్లో తొమ్మిది మంది బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన 80 మందికి పైగా వ్యక్తులందరూ ఇథియోపియా జాతీయులు కావడం గమనార్హం.

గల్ఫ్ దేశాల కలల ప్రయాణం.. ప్రమాదకర సముద్ర మార్గం

స్వదేశంలో తీవ్రమైన పేదరికం, అభద్రతా భావం , వాతావరణ మార్పుల దుష్ప్రభావాల కారణంగా బతుకుదెరువు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి నిరుపేద వలసదారులు ఈ అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని ఆశ్రయిస్తున్నారని ఐఓఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాబ్ ఎల్-మండెబ్ జలసంధి (Bab el-Mandeb Strait) గుండా యెమెన్ మీదుగా గల్ఫ్ దేశాలకు వెళ్లే క్రమంలో ఇలాంటి విషాదాలు తరచూ పునరావృతమవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. ప్రస్తుతం జిబౌటి స్థానిక అధికారులతో కలిసి ఐఓఎం రెస్క్యూ సిబ్బంది సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.