US vs Iran : ట్రంప్ విధించిన 4 డెడ్‌లైన్ షరతులకు ఇరాన్ లొంగుతుందా? లేక ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?

US vs Iran :ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ముగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ 4 కఠిన షరతులు విధించారు. లొంగకపోతే తీవ్రమైన దాడులు ఉంటాయని వైట్ హౌస్ హెచ్చరించింది.

CR Reddy
Published on: 22 May 2026 7:25 AM IST
US vs Iran
X

US vs Iran

US vs Iran : పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌ను పూర్తిగా లొంగదీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినమైన నాలుగు షరతులను విధించారు. ఈ షరతులను పాకిస్తాన్ దేశం ద్వారా ఇరాన్ రాజధాని టెహరాన్‌కు చేరవేశారు. ఒకవేళ ట్రంప్ పెట్టిన ఈ కండిషన్లకు ఇరాన్ ఒప్పుకోకపోతే, చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆ దేశంపై అత్యంత భయంకరమైన సైనిక దాడి జరుగుతుందని వైట్ హౌస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్‌ను అమెరికా మధ్యవర్తిగా వాడుకుంటోంది. అమెరికా పంపిన ఫైనల్ వార్నింగ్ డ్రాఫ్ట్‌తో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహసిన్ నఖ్వీ ఇప్పటికే ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. మరోవైపు, పాక్ సైన్యానికి చెందిన ఫీల్ డీల్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా ఆఖరి ప్రతిపాదనలతో టెహరాన్ చేరుకుంటున్నారు. అమెరికా తన షరతుల విషయంలో ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అల్-అరేబియా స్పష్టం చేసింది. హజ్ సీజన్ ముగిసిన తర్వాత ఇస్లామాబాద్‌లో దీనిపై అధికారిక చర్చలు జరగాల్సి ఉంది.

ట్రంప్ విధించిన ఆ 4 సింహస్వప్న షరతులు ఇవే

అమెరికా ఇరాన్ ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆ దేశాన్ని పూర్తిగా నిరుపేదగా మార్చేలా ఉన్నాయి.

* మొదటి షరతు: ఇరాన్ తన అణ్వాయుధ (న్యూక్లియర్) కార్యక్రమాన్ని ఎప్పటికీ సమాధి చేయాలి. దీనిపై ఎలాంటి మినహాయింపులు ఉండవు.

* రెండో షరతు: అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పై ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ ఉండకూడదు.

* మూడో షరతు: శాశ్వత ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసే వరకు ఆ దేశంపై ఉన్న ఆర్థిక ఆంక్షలను అస్సలు తొలగించే ప్రసక్తే లేదు.

* నాలుగో షరతు: గత యుద్ధాల్లో ఇరాన్‌కు జరిగిన ఎలాంటి నష్టానికి కూడా అమెరికా విరాళాలు లేదా పరిహారం ఇవ్వదు.

వైట్ హౌస్ సీరియస్ వార్నింగ్

ఈ అంశంపై డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి మేము అస్సలు ఒప్పుకోమని, ఇజ్రాయెల్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌ను నాశనం చేసేందుకు వారికి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వాయుసేన పూర్తిగా బలహీనపడ్డాయని వ్యాఖ్యానించారు. దీనికి తోడు వైట్ హౌస్ పాలసీ డిప్యూటీ చీఫ్ స్టీఫెన్ మిల్లర్ ఇరాన్‌కు నేరుగా చావు కబురు పంపారు. ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పందాన్ని తిరస్కరిస్తే, ఇరాన్ దేశం మొత్తం బూడిదయ్యేలా భయంకరమైన దాడులు ఉంటాయని హెచ్చరించారు.

రెడ్ లైన్ గీసిన ఇరాన్ సుప్రీం లీడర్

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఎంతటి ధర చెల్లించడానికైనా సిద్ధమే కానీ, ఇరాన్‌కు చెందిన ఒక్క గ్రాము యురేనియం కూడా దేశం దాటి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఆర్డర్ వేశారు. దీనితో ట్రంప్ ఆశలపై ఇరాన్ సుప్రీం లీడర్ గట్టిగా నీళ్లు చల్లారు. ఇరాన్ రక్షణ వ్యూహకర్త మహ్మద్ బాకర్ కాలిబాఫ్ మాట్లాడుతూ.. శత్రువు మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడని, ఇరాన్ సైన్యం దానికి తగిన బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉందని ప్రకటించారు.

చర్చలకు సిద్ధమంటున్న ఇరాన్ ప్రెసిడెంట్

ఇరాన్ వ్యాప్తంగా అమెరికా షరతులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టెహరాన్ మేయర్ అలీరెజా జకానీ మాట్లాడుతూ.. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపాలన్నా మొదట హోర్ముజ్ జలసంధి వద్ద విధించిన దిగ్బంధనాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచే ఉంచారు. ఇరాన్ ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పదని, అయితే బలవంతంగా మమ్మల్ని లొంగదీసుకోవాలని చూస్తే అమెరికా భ్రమలు ఈ యుద్ధంలో పటాపంచలు కావడం ఖాయమని హెచ్చరించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story