Donald Trump: మరో చారిత్రక ఒప్పందానికి ట్రంప్ తెరలేపుతున్నారా?
Donald Trump: ఇరాన్‌తో ఘర్షణ వాతావరణం ముగిసిన తదనంతర పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అమెరికా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.
Donald Trump
Donald Trump: పశ్చిమాసియాలో దశాబ్దాలుగా రగులుతున్న వివాదాలకు సరికొత్త పరిష్కారం చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత రహస్యంగా పావులు కదుపుతున్నారు. ఇరాన్ వైఖరిని అణచివేయడంతో పాటు గల్ఫ్ ప్రాంతంలో సరికొత్త భద్రతా కూటమిని నిర్మించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వాషింగ్టన్ వర్గాల నుంచి అందిన సంచలన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్‌తో ఘర్షణ వాతావరణం ముగిసిన తదనంతర పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అమెరికా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. అధ్యక్షుడి ముఖ్య సలహాదారులు, రక్షణ, దౌత్య విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ భారీ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఆక్సియోస్ అందించిన వివరాల ప్రకారం.. పశ్చిమాసియా వ్యాప్తంగా అమెరికా మిత్రదేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాంతంలో ఇరాన్ విస్తరణవాదానికి అడ్డుకట్ట వేస్తూ, అమెరికా స్వయంగా ఈ దేశాలకు భద్రతా హామీనిచ్చే ప్రధాన భాగస్వామిగా నిలవాలని భావిస్తోంది.
మూడు కీలక పునాదులపై సరికొత్త వ్యూహం
ట్రంప్ ప్లాన్‌లో ప్రధానంగా మూడు అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఇరాన్ సృష్టిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అరబ్ దేశాలతో ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయడం. రెండోది, అక్టోబర్ 7 నాటి తీవ్ర ఘర్షణల తర్వాత మొదలైన వివాదాలను సద్దుమణిగేలా చేయడం. ఇందులో భాగంగా గాజా ప్రణాళిక తదుపరి దశను అమలు చేయడం, ఇజ్రాయెల్-సిరియా మధ్య రక్షణ ఒప్పందాన్ని కుదర్చడం, లెబనాన్ శాంతి నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ఉన్నాయి. ఇక మూడోది, అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించి అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్ ముద్రను బలోపేతం చేయడం.
ఇజ్రాయెల్-సౌదీ మధ్య చారిత్రక మైత్రికి ప్రయత్నాలు
ఈ సమగ్ర ప్రణాళికలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం. ఒకవేళ అమెరికా గనుక ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చగలిగితే, అది ట్రంప్ దౌత్య చరిత్రలోనే అత్యంత అరుదైన విజయంగా నిలిచిపోతుంది. ఇరాన్ పెంచుతున్న ఒత్తిడిని సమర్థంగా తట్టుకోవడానికి కూడా ఈ రెండు దేశాల కలయిక ఎంతో అవసరమని వాషింగ్టన్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికల సందడి మధ్య అమలు సాధ్యమేనా?
అయితే ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలోకి తీసుకురావడం అంత సులువేమీ కాదు. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్‌లో అమెరికాలోనూ మిడ్‌టర్మ్ ఎన్నికల వేడి రగులుతోంది. అక్కడ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం తమ కొత్త విధానాలకు సహకరిస్తుందా లేదా అనే సందేహాలు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడటానికి ట్రంప్ సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ముసాయిదా దశలోనే ఉన్న ఈ ప్లాన్‌కు అంతిమ రూపం ఇచ్చేందుకు మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశముంది.




