Donald Trump : గల్ఫ్ దేశాల రిక్వెస్ట్‌తో వెనక్కి తగ్గిన అమెరికా.. ఆఖరి నిమిషంలో ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ బ్రేక్

Donald Trump : ఇరాన్‌పై సైనిక దాడిని డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వాయిదా వేశారు.గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు, శాంతి చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

CR Reddy
Published on: 19 May 2026 7:34 AM IST
Donald Trump
X

Donald Trump 

Donald Trump : ప్రపంచం మరో పెను యుద్ధం ముంగిట నిలబడి తృటిలో తప్పించుకుంది. ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధం చేసిన భారీ సైనిక దాడి ప్లాన్ ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. మంగళవారం (మే 19) ఇరాన్‌పై విరుచుకుపడాలని అమెరికా బలగాలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్‌ చేశారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు, శాంతి చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

మధ్యప్రాచ్య దేశాల రిక్వెస్ట్.. ట్రంప్ మెత్తబడ్డారా?

ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించేందుకు వైట్ హౌస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, ఈ యుద్ధం వల్ల మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతం అల్లకల్లోలం అవుతుందని సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి అమెరికా మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయా దేశాల నేతలు ట్రంప్‌తో మాట్లాడి, దాడిని వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం ఇరాన్‌తో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, ఈ సమయంలో యుద్ధం మొదలైతే పరిస్థితి చేజారిపోతుందని వారు నచ్చజెప్పారు. తన స్నేహ దేశాల విన్నపాన్ని మన్నించిన ట్రంప్, ప్రస్తుతానికి యుద్ధ విమానాలను వెనక్కి రప్పించారు.

ట్రంప్ వార్నింగ్

దాడిని వాయిదా వేసినప్పటికీ, ట్రంప్ తన హెచ్చరికల తీవ్రతను మాత్రం తగ్గించలేదు. "ఇరాన్ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. మర్యాదగా ఒప్పందానికి రాకపోతే, ఆ దేశంలో ఏదీ మిగలదు" అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. ఏప్రిల్ మధ్యలో జరిగిన యుద్ధ విరామం ఎప్పుడైనా ముగిసిపోవచ్చని, ఇరాన్ గనుక అమెరికా పెట్టిన నిబంధనలకు తలొగ్గకపోతే నిమిషాల వ్యవధిలో దాడి మొదలవుతుందని స్పష్టం చేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అమెరికా సైన్యానికి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ..

ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కూడా ట్రంప్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో అటు టెహ్రాన్ వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. చర్చలు విఫలమైతే మే నెల ఆఖరు నాటికి పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్యం తీసుకోబోయే తదుపరి అడుగు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story