Donald Trump : నేను మోదీకి పెద్ద ఫ్యాన్‌ని.. ఢిల్లీ ఈవెంట్‌లో ఫోన్ లైన్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పీఎం మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ తనపై 100 శాతం నమ్మకం ఉంచవచ్చని, ఎలాంటి అవసరమున్నా నేరుగా ఫోన్ చేయవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.

CR Reddy
Published on: 25 May 2026 7:43 AM IST
Donald Trump
X

  Donald Trump 

Donald Trump : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పీఎం మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, భారత్ దేశం తనపై అలాగే అమెరికాపై వంద శాతం నమ్మకం పెట్టుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అమెరికా స్వాతంత్రం పొంది 250 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. దానికి గుర్తుగా ఆదివారం రాత్రి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన ఫోన్ ద్వారా అధ్యక్షుడు ట్రంప్‌ను లైవ్ లైన్లోకి తీసుకువచ్చి, అక్కడి మైక్రోఫోన్ దగ్గర పెట్టారు. ఈ సర్ప్రైజ్ కాల్‌తో హాల్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ ఫోన్ కాల్ ద్వారా భారత ప్రజలనుద్దేశించి మాట్లాడిన ట్రంప్.. "అందరికీ నా నమస్కారాలు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనొక గొప్ప నాయకుడు, నా మంచి మిత్రుడు. నేను పీఎం మోదీకి చాలా పెద్ద అభిమానిని" అంటూ మనసులోని మాటను పంచుకున్నారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం భారత్-అమెరికా దేశాలు కాలేజీ ఫ్రెండ్స్ లాగా దగ్గరయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని, ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా నేరుగా తనకే ఫోన్ చేయవచ్చని ట్రంప్ ఈ సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఈ అంతర్జాతీయ వేడుకలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా చరిత్రలోనే మార్కో రూబియో అత్యంత గొప్ప విదేశాంగ మంత్రి అవుతారని ప్రశంసించారు. ఇక తన ప్రసంగం ముగిసేటప్పుడు కూడా.. "మోదీకి నా అభినందనలు చెప్పండి, నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని మరీ మరీ గుర్తుచేయండి" అని రాయబారితో చెప్పారు. అటు మార్కో రూబియో కూడా మాట్లాడుతూ.. ప్రపంచ వేదికపై భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని కొనియాడారు. ఇదే వేడుకలో రూబియో పుట్టినరోజును కూడా అందరూ కలిసి సెలబ్రేట్ చేశారు.

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. అమెరికా స్వాతంత్ర ప్రకటనలోని వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన, వాక్ స్వాతంత్రం వంటి అంశాలు ఆధునిక ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని గుర్తుచేశారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ విలువల ప్రాధాన్యత చాలా ఎక్కువని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలను మరింత గట్టిగా మార్చుకోవడానికి ఇది సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాడిన దిల్ సే, మా తుజే సలామ్, తేరే బినా లాంటి పాటలతో భారత్ మండపం మారుమోగిపోయింది. చివర్లో అమెరికన్ బ్యాండ్ విలేజ్ పీపుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ ప్రోగ్రాం గ్రాండ్‌గా ముగిసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story