Super Intelligence: AIకి ట్రంప్ కొత్త పేరు.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’!

Super Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరును 'సూపర్ ఇంటెలిజెన్స్ (SI)'గా మారుస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Sept 2026 8:58 AM IST
Super Intelligence
X

Super Intelligence: AIకి ట్రంప్ కొత్త పేరు.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’!

Super Intelligence: సాంకేతిక ప్రపంచంలో అత్యంత కీలక పరిణామంగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇకపై 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సాంకేతికతను 'సూపర్ ఇంటెలిజెన్స్' (Super Intelligence - SI) అని వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. 'ఆర్టిఫిషియల్' అనే పదం ఈ రోజుల్లో ఈ సాంకేతికత స్థాయిని సరిగ్గా ప్రతిబింబించలేకపోతోందని, ఇది సాంకేతికతను 'నకిలీ' (Fake) అని చూపించేలా ఉందనే అభిప్రాయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, ఫెడరల్ ఏజెన్సీ పత్రాల్లో 'ఏఐ'కి బదులుగా 'సూపర్ ఇంటెలిజెన్స్' లేదా 'సై' (SI) అనే పదాన్నే వాడాలని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై (Executive Order) సంతకం చేశారు.


ఈ కీలక ప్రకటనకు ముందు వైట్‌హౌస్‌లో ఓపెన్ ఏఐ (OpenAI), మెటా (Meta), ఆంథ్రోపిక్ (Anthropic) వంటి దిగ్గజ టెక్ సంస్థల సీఈఓలు, ప్రతినిధులతో ట్రంప్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గ్లోబల్ టెక్ రేస్‌లో చైనాతో పోటీపడుతూ అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుకోవడం, భద్రత మరియు ఆవిష్కరణల (Safety & Innovation) సమతుల్యతపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికత అభివృద్ధితో పాటు భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తామని టెక్ నాయకులు పునరుద్ఘాటించారు.


గతంలో పారిశ్రామిక విప్లవం మరియు ఇంటర్నెట్ సాధించిన పురోగతి కంటే 'సూపర్ ఇంటెలిజెన్స్' విప్లవం మరింత అతిపెద్దదని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరియు గ్లోబల్ డిజిటల్ రంగాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మార్పు కోసం త్వరలోనే సంబంధిత చట్ట సవరణల నివేదికలను కాంగ్రెస్‌కు సమర్పించాలని అమెరికా పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్