Donald Trump : ఆ గడ్డిపై రాసిన ‘8647’ నెంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ట్రంప్‌కు ముప్పు పొంచి ఉందా ?
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజుకు ముందు వాషింగ్టన్ నేషనల్ మాల్ గడ్డిపై 8647 అనే ట్రంప్ వ్యతిరేక సంఖ్య ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Donald Trump
Donald Trump : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన నేషనల్ మాల్లో ఒక వింత ఘటన వెలుగుచూసింది. అక్కడి గడ్డి మైదానంపై చాలా పెద్ద అక్షరాలతో 8647 అనే సంఖ్య స్పష్టంగా కనిపించడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. జూన్ 14వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక భారీ యూఎఫ్సీ ఫైటింగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కోసం వేలాది మంది జనాలు తరలివచ్చే అవకాశం ఉన్న తరుణంలో, ట్రంప్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందే ఈ వివాదాస్పద నెంబర్ ప్రత్యక్షం కావడం అమెరికా భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.
ట్రంప్ వ్యతిరేక కోడ్ 8647 వెనుక ఉన్న అసలు కథ
అమెరికా రాజకీయాల్లో 8647 అనే నెంబర్‌కు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. దీనిని సాధారణంగా డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక కోడ్‌గా లేదా ఆయనను పదవి నుంచి తొలగించాలనే నినాదంగా పరిగణిస్తారు. అమెరికాలోని రెస్టారెంట్ పరిశ్రమలో ఇండస్ట్రీలో అనే పదాన్ని ఒక కస్టమర్‌ను హోటల్ నుంచి బయటకు పంపించడానికి లేదా ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయడానికి కోడ్ భాషగా ఉపయోగిస్తారు. ఇక 47 అనేది డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఉన్నారనే విషయానికి గుర్తు. ఈ రెండింటినీ కలిపి 8647 అంటే ‘47వ అధ్యక్షుడైన ట్రంప్‌ను ఇక్కడి నుంచి లేపేయండి లేదా తొలగించండి’ అనే నెగెటివ్ అర్థంలో ట్రంప్ వ్యతిరేకులు వాడుతుంటారు. ప్రస్తుత ట్రంప్ యంత్రాంగం దీనిని అధ్యక్షుడి ప్రాణాలకే ముప్పు తెచ్చే ఒక బెదిరింపుగా చూస్తోంది.
లైవ్ వెబ్‌క్యామ్‌లో దొరికిన వింత ఆకారం
వాషింగ్టన్ మానిమెంట్ పైభాగంలో అమర్చిన లైవ్ వెబ్‌క్యామ్ ఫుటేజ్‌లో ఈ నెంబర్ మొదటిసారిగా బయటపడింది. వరల్డ్ వార్-2 మెమోరియల్ తూర్పు ప్రాంతంలోని నేషనల్ మాల్ గడ్డి మైదానంలో ఒక పెద్ద భాగం ఎండిపోయి లేదా పసుపు రంగులోకి మారిపోయి ఉంది. ఆ ఎండిపోయిన భాగమే పైనుండి చూసినప్పుడు పర్ఫెక్ట్‌గా ‘8647’ ఆకారంలో కనిపించింది. అయితే ఈ మార్కింగ్ ఎప్పుడు, ఎవరు చేశారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. జూన్ 5వ తేదీన తీసిన శాటిలైట్ లేదా సాధారణ ఫొటోల్లో ఈ నెంబర్ లేదు. దీన్ని బట్టి చూస్తే గత రెండు మూడు రోజుల్లోనే ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం రసాయనాలు చల్లి గడ్డి రంగు మారేలా చేశారని అనుమానిస్తున్నారు.
రంగంలోకి దిగిన సాయుధ బలగాలు
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వాషింగ్టన్ డీసీలో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో అనేక అత్యవసర రక్షణ వాహనాలు, సైరన్లతో నేషనల్ మాల్‌కు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అదే సమయంలో యూఎస్ ఆర్మీకి చెందిన గోల్డెన్ నైట్స్ పారాచూట్ టీమ్ కూడా అక్కడ ల్యాండ్ అవ్వడం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ ఘటనపై వైట్ హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగల్ స్పందిస్తూ.. దేశంలో రాజకీయ హింసకు లేదా ప్రజాస్వామ్య నేతలపై దాడులకు పిలుపునిచ్చే ఇలాంటి ఆలోచనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గతంలోనూ ఇలాంటి ఘటనే
ప్రస్తుతం ఈ కేసును ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్ పర్యవేక్షణలో యూఎస్ పార్క్ పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గడ్డి రంగు అలా హఠాత్తుగా ఎందుకు మారిందో తెలుసుకోవడానికి నేషనల్ మాల్ మేనేజ్‌మెంట్ అక్కడి గడ్డి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపింది. నేషనల్ మాల్ బాధ్యతలు చూసే హోం శాఖ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. నిజానికి 8647 నెంబర్ వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏప్రిల్ నెలలో ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సముద్రపు గవ్వలతో 8647 అని రాసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ట్రంప్‌ను బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అమెరికా న్యాయ శాఖ ఆయనపై కఠిన చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు నేరుగా వాషింగ్టన్ నడిబొడ్డునే ఈ నెంబర్ ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది.




