Donald Trump: ప్రపంచకప్ సక్సెస్.. ఫిఫా బాస్‌కు ప్రమోషన్ ఇవ్వనున్న డొనాల్డ్ ట్రంప్!
Donald Trump: ఫిఫా ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన గియాని ఇన్‌ఫాంటినోను ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్‌గా నియమించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన ప్రతినిధి పౌలో జంపోలి వెల్లడించారు.
Donald Trump: ప్రపంచకప్ సక్సెస్.. ఫిఫా బాస్‌కు ప్రమోషన్ ఇవ్వనున్న డొనాల్డ్ ట్రంప్!
Donald Trump: 39 రోజుల పాటు 104 మ్యాచ్‌లతో సాగిన ఫిఫా ప్రపంచకప్ సాకర్ సమరం దిగ్విజయంగా ముగిసింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అర్జెంటీనాపై 1-0 తేడాతో గెలిచి స్పెయిన్ విజేతగా నిలిచింది. మెక్సికో, కెనడాతో కలిసి ఈ టోర్నీకి విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రపంచ దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా గియానికి ఉందని, ఆయనకు ఏకంగా ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు ఆయన ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి మీడియాకు వెల్లడించారు. "ప్రపంచవ్యాప్తంగా గియాని ఎంతో గౌరవం సంపాదించారు. 211 సభ్య దేశాలు ఉన్న ఫిఫాను అద్భుతంగా నడిపిన ఆయనకు, 193 దేశాల సమాఖ్య అయిన ఐరాసను నడిపించే బాధ్యత అప్పగించాలనేది ట్రంప్ అభిప్రాయం" అని జంపోలి పేర్కొన్నారు.
ప్రస్తుత ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పదవీకాలం డిసెంబర్ చివరి వరకు ఉంది. ఈ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. భద్రతా మండలిలోని 15 దేశాల మద్దతుతో పాటు పి-5 (P5) శాశ్వత సభ్య దేశాలైన యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనాల వీటోను తట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడిగా స్విట్జర్లాండ్‌కు చెందిన గియాని ఏడాదికి దాదాపు 6 మిలియన్ డాలర్లు (రూ. 58 కోట్లు) ఆర్జిస్తున్నారు.
అదే ఐరాస చీఫ్‌గా బాధ్యతలు చేపడితే వార్షిక వేతనం 4.18 లక్షల డాలర్లు (సుమారు రూ. 4 కోట్లు) మాత్రమే ఉంటుంది. వేతనంలో భారీ వ్యత్యాసం, ఐరాస ఎంపిక విధానాల సవాళ్ల నడుమ గియాని ఇన్‌ఫాంటినో ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.




