Donald Trump : డబ్బులు సూట్‌కేసుల్లో పంపారా? ఒబామా గుట్టు విప్పిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump, Iran, Barack Obama, Joe Biden,
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా అమెరికాను ఎగతాళి చేస్తున్న ఇరాన్, ఇకపై నవ్వుకోలేదని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్‌తో పాటు మాజీ అధ్యక్షులు ఒబామా, జో బైడెన్‌లపై ఆయన విరుచుకుపడ్డారు. గడిచిన 47 ఏళ్లుగా ఇరాన్ అమెరికాను తప్పుదోవ పట్టిస్తోందని ట్రంప్ ఆరోపించారు. "ఇరాన్ మమ్మల్ని ఎదురుచూసేలా చేసింది, రహదారి బాంబులతో మా ప్రజలను చంపింది, నిరసనలను అణచివేసింది. ఇటీవల 42,000 మంది అమాయక నిరసనకారులను పొట్టనబెట్టుకుంది. మా గొప్ప దేశాన్ని చూసి వెక్కిరించింది. కానీ ఇకపై వారి పప్పులు ఉడకవు, వారు ఇక నవ్వుకోలేరు" అని ట్రంప్ కంఠాన్ని సవరించారు. ఇరాన్ చేస్తున్న జాప్యం ఇకపై చెల్లదని ఆయన స్పష్టం చేశారు.
ఒబామాపై సంచలన ఆరోపణలు
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌కు అనవసర ప్రాధాన్యత ఇచ్చారని ట్రంప్ విమర్శించారు. ఒబామా తన పదవీకాలంలో ఇరాన్‌కు వందల బిలియన్ డాలర్లు, అలాగే 1.7 బిలియన్ డాలర్ల నగదును విమానాల్లో పంపారని ఆరోపించారు. వాషింగ్టన్, వర్జీనియా, మేరీల్యాండ్ బ్యాంకులను ఖాళీ చేసి మరీ ఆ సొమ్మును ఇరాన్ గూండాలకు అందజేశారని, అంత డబ్బును వారు జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరని ఎద్దేవా చేశారు. ఇరాన్ పట్ల అమెరికా అప్పట్లో బలహీనంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
బైడెన్‌ను కూడా వదలని ట్రంప్
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జో బైడెన్‌పై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఒబామా దేశానికి ఒక విపత్తులా మారారని, అయితే బద్ధకస్తుడైన జో బైడెన్ అంత దారుణంగా మాత్రం కాదని ఎద్దేవా చేశారు. అమెరికాను ప్రపంచ దేశాల ముందు బలహీనంగా చూపించడంలో వీరిద్దరూ పోటీ పడ్డారని ట్రంప్ ధ్వజమెత్తారు. అమెరికా ఇప్పుడు మళ్లీ శక్తివంతంగా మారిందని, ఇరాన్ బెదిరింపులకు లొంగబోమని ఆయన తేల్చి చెప్పారు.
ఇరాన్ శాంతి ప్రతిపాదనలో ఏముంది?
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో కాల్పుల విరమణ జరగాలని, హార్ముజ్ జలసంధిలో ఓడల భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. అయితే అణు కార్యక్రమం వంటి సున్నితమైన అంశాలపై చర్చించే ముందు హింసను ఆపాలని అమెరికా ముందే షరతు పెట్టింది. ప్రస్తుతం ఇరాన్ పంపిన సమాధానంపై అమెరికా అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వనప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్ విషయంలో వైట్ హౌస్ చాలా కఠినంగా ఉండబోతోందని అర్థమవుతోంది.




