Donald Trump : సమయం మించిపోతుంది.. త్వరగా తేల్చుకోకపోతే అంతా మసే.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చివరి హెచ్చరిక జారీ చేశారు. త్వరగా అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోకపోతే భారీ సైనిక దాడులు తప్పవని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే, గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ సైనిక దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. "గడియారం వేగంగా తిరుగుతోంది.. ఇరాన్‌కు సమయం తక్కువగా ఉంది" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొత్త అణు ఒప్పందంపై ఇరాన్ మెరుగైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ వ్యవహారంపై చర్చించేందుకు ట్రంప్ మంగళవారం వైట్ హౌస్‌లోని సిట్యుయేషన్ రూమ్‌లో జాతీయ భద్రతా బృందంతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక చర్యల ఆప్షన్లపై చర్చించబోతున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే, అమెరికా మళ్లీ దాడులు మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ట్రంప్ తన ముఖ్య అధికారులైన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, సీఐఏ చీఫ్ జాన్ రాట్‌క్లిఫ్‌లతో వర్జీనియాలో ప్రాథమిక చర్చలు పూర్తి చేశారు.
ఇరాన్ బెదిరింపుల నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకునే విషయంలో ఇరు దేశాలు ఏకతాటిపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను నియంత్రించకపోతే పశ్చిమాసియాలో శాంతి అసాధ్యమని ఇరు నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు పాకిస్థాన్, ఖతార్ దేశాలు అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్ ఇచ్చే ఆఫర్ బెస్ట్‌గా ఉండాలని పట్టుబడుతున్నారు.
ఇదే సమయంలో అబుదాబిలోని బరాకా అణు విద్యుత్ ప్లాంట్ వెలుపల జరిగిన డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఎలక్ట్రిక్ జనరేటర్‌లో మంటలు చెలరేగాయి. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ మూడు డ్రోన్లను గుర్తించి, అందులో రెండింటిని కూల్చివేసింది. దీని వెనుక నేరుగా ఇరాన్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఇరాన్ అనుబంధ గ్రూపుల హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ప్లాంట్ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని, పనులు సాధారణంగా సాగుతున్నాయని యూఏఈ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.




