Netherlands : యువరాణుల హత్యకు సినిమా రేంజ్లో స్కెచ్.. గొడ్డళ్లతో దొరికిన దుండగుడు
Netherlands : నెదర్లాండ్స్ యువరాణుల హత్యకు కుట్ర పన్నిన నిందితుడిని పోలీసులు గొడ్డళ్లతో సహా అరెస్ట్ చేశారు. అమాలీయా, అలెక్సియాలకు ఉన్న ముప్పు పొంచి ఉంది.
Princess Amalia
Netherlands : నెదర్లాండ్స్ రాజకుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. ఆ దేశ యువరాణులు కేథరీనా అమాలీయా, అలెక్సియాలను చంపేందుకు జరిగిన ఒక భయంకరమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హేగ్ నగరంలో గొడ్డళ్లు, నాజీ సందేశాలతో తిరుగుతున్న ఒక అనుమానితుడిని పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం అప్రమత్తమై రాజకుటుంబానికి భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఏమిటా కుట్ర? ఎలా దొరికాడు?
నెదర్లాండ్స్ యువరాణులు కాథరినా అమాలీయా (22), అలెక్సియా (20)లను టార్గెట్ చేస్తూ 33 ఏళ్ల ఒక వ్యక్తి భయంకరమైన ప్లాన్ వేశాడు. ఫిబ్రవరిలోనే హేగ్ నగరంలో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, దర్యాప్తు గోప్యత నిమిత్తం ఇప్పుడు ఆ వివరాలను బయటపెట్టారు. నిందితుడి దగ్గర రెండు గొడ్డళ్లు దొరికాయి. వాటిపై అలెక్సియా, మొసాద్, సీగ్ హెయిల్ (నాజీల నినాదం) వంటి పదాలు రాసి ఉన్నాయి. అంతేకాదు, ఆ యువరాణుల పేర్లతో పాటు బ్లడ్ బాత్ (రక్తపాతం) అని రాసి ఉన్న ఒక లేఖ కూడా దొరికింది. దీన్ని బట్టి అతడు ఎంతటి హింసాత్మక దాడికి సిద్ధమయ్యాడో అర్థమవుతోంది.
అమాలీయాకు వెంటాడుతున్న ముప్పు
నెదర్లాండ్స్ రాజు విల్లెం-అలెగ్జాండర్ పెద్ద కుమార్తె అయిన అమాలీయా, భవిష్యత్తులో ఆ దేశానికి రాణి కాబోతున్నారు. అందుకే ఆమెపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఒక డ్రగ్ గ్యాంగ్ ఆమెను, అప్పటి ప్రధాని మార్క్ రుట్టేను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేసింది. అలాగే 2020లో ఆమెపై అత్యాచారం చేస్తానంటూ ఒక వ్యక్తి బెదిరించాడు. ఈ ప్రాణహాని కారణంగా ఆమె కొన్నాళ్ల పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉండాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె ఆమ్స్టర్‌డామ్ లోని తన విద్యార్థి గృహాన్ని వదిలిపెట్టి రాజభవనానికి మారాల్సి వచ్చింది.
స్వేచ్ఛ లేని యువరాణి జీవితం
నిరంతర బెదిరింపుల వల్ల అమాలీయా తన సాధారణ జీవితాన్ని పూర్తిగా కోల్పోయారు. 2024లో ఆమె చదువు పూర్తి చేసేందుకు రహస్యంగా స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరానికి వెళ్లారు. "సాధారణ అమ్మాయిలా బయట తిరగడం, మార్కెట్‌కు వెళ్లడం వంటివి నాకు మిగిలిపోయిన జ్ఞాపకాలు మాత్రమే. ఇప్పుడు నేను అలా చేయలేను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాణి మాక్సిమా కూడా తన కుమార్తె పరిస్థితిని చూసి కలత చెందుతున్నారు. ఒక యువరాణిగా బాధ్యతలు పెరిగేకొద్దీ ఆమె చుట్టూ ముప్పు కూడా పెరుగుతోంది.
నేడు కోర్టు విచారణ
నెదర్లాండ్స్ చట్టాల ప్రకారం నిందితుడి పేరును పోలీసులు ఇంకా వెల్లడించలేదు. నేడు (సోమవారం) అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఏప్రిల్ 27న జరిగిన కింగ్స్ డే వేడుకల సమయంలో కూడా రాజకుటుంబానికి భారీ భద్రత కల్పించారు. నిందితుడి వెనుక ఏదైనా ఉగ్రవాద ముఠా ఉందా లేక అతడు నాజీ భావజాలంతో ఒంటరిగా ఈ ప్లాన్ చేశాడా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఐరోపా దేశాల్లోని రాజకుటుంబాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.




