Ebola : మానవాళికి మరో మహమ్మారి ముప్పు? కొత్త వేరియంట్ దాటికి 60 రోజుల్లో 1000 మంది బలి
Ebola : కాంగోలో ఎబోలా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేవలం రెండు నెలల్లోనే 1,000 మందికి పైగా మృతి చెందగా, టీకాలు, నిధుల కొరత వల్ల పరిస్థితి చేయిదాటుతోందని WHO హెచ్చరించింది.
Ebola Outbreak Congo
Ebola : ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్ రక్కసిలా విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలోనే ఈ వైరస్ తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టాన్ని కలిగిస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలోనే కాంగోలో ఎబోలా బారిన పడి వెయ్యి మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితిపై ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆందోళన వ్యక్తం చేసింది. మానవ చరిత్రలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎబోలా విజృంభణ ఇదేనని నిపుణులు వెల్లడిస్తున్నారు.
వ్యాక్సిన్, మందులు లేని కొత్త వేరియంట్
మే 15న గుర్తించిన ఈ కొత్త ఎబోలా వేరియంట్ బుండిబుగ్యో రకానికి చెందినదిగా అధికారులు నిర్ధారించారు. గతంలో వచ్చిన ఎబోలా రకాలకు టీకాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వ్యాపిస్తున్న ఈ కొత్త రకానికి ఎటువంటి ఆమోదించబడిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 2,473కి పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, అందులో 1,031 మంది మరణించారు. దాదాపు 737 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో తీవ్రమైన లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.
అసలు మరణాలు నాలుగు రెట్లు ఎక్కువ ఉండొచ్చు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బయటకు వచ్చిన గణాంకాల కంటే అసలు బాధితుల సంఖ్య 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగోలోని ఇతురి ప్రాంతో పాటు మరో నాలుగు ప్రావిన్సుల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న సాయుధ పోరాటాలు, ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్య సిబ్బంది బాధితుల వద్దకు చేరుకోలేకపోతున్నారు. దీనివల్ల వందలాది మరణాలు లెక్కల్లోకి రావడం లేదని భావిస్తున్నారు.
శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాప్తి
ఎబోలా ఒక అత్యంత ప్రమాదకరమైన సాంక్రమిక వ్యాధి. బాధితుల వాంతులు, రక్తం, చెమట లేదా ఇతర శరీర ద్రవాలను తాకడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 80 శాతం కంటే ఎక్కువ కేసులు ముందస్తుగా ట్రాక్ చేయలేకపోయిన ప్రాంతాల నుంచే వస్తున్నాయి. అంటే వైద్యాధికారుల అంచనాల కంటే చాలా వేగంగా వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోందని అర్థమవుతోంది.
పరిశోధకులకు, ఆరోగ్య సిబ్బందికి అవరోధాలు
కాంగోలో వైరస్‌తో పాటు అంతర్యుద్ధం కూడా పెద్ద సమస్యగా మారింది. ఎబోలా బారిన పడి మరణించిన వారి మృతదేహాల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రత్యేక బృందాలు సురక్షితమైన పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే, స్థానిక తెగలు, ప్రజలు తమ సాంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. అంతేకాకుండా గడిచిన కొన్ని నెలలుగా జీతాలు అందకపోవడంతో కొందరు హెల్త్‌కేర్ వర్కర్లు నిరసనలు తెలుపుతూ సమ్మెకు దిగడం అక్కడ ఆరోగ్య వ్యవస్థను మరింత కుప్పకూలేలా చేసింది.




