Ebola Virus : ప్రపంచాన్ని వణికిస్తున్న మరో డేంజర్ వైరస్.. వందలాది మరణాలు.. అలర్ట్ అయిన భారత్!

Ebola Virus : ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలలో బుండిబుగ్యో స్ట్రెయిన్ ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

CR Reddy
Published on: 28 May 2026 7:57 AM IST
Ebola Virus
X

Ebola Virus  

Ebola Virus : కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. అంతలోనే మరో అత్యంత ప్రమాదకరమైన వైరస్ ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆఫ్రికా ఖండంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ ప్రస్తుతం వినాశనం సృష్టిస్తోంది. తూర్పు కాంగోలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఏకంగా వెయ్యికి చేరువలో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 900 కి పైగా కేసులు నమోదు కాగా, సుమారు 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాంగోలో 112 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా, పొరుగు దేశమైన ఉగాండాలోనూ కేసులు బయటపడుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

ఈసారి వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ మరింత ప్రమాదకరమైనదిగా నిపుణులు గుర్తిస్తున్నారు. దీనిని బుండిబుగ్యో స్ట్రెయిన్ అని పిలుస్తారు. ఇది ఎబోలా వైరస్‌లలోనే అత్యంత అరుదైన, వినాశకరమైన రకం. దీనికి మార్కెట్లో ఎలాంటి నిర్దిష్టమైన వ్యాక్సిన్ లేదా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేదు. దీనివల్ల సోకిన వారిలో మరణాల రేటు 30 శాతం నుంచి 50 శాతం వరకు ఉండే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. ఈ వైరస్ మొట్టమొదటిసారిగా 2007 లో ఉగాండాలోని బుండిబుగ్యో ప్రాంతంలో వెలుగుచూసింది. వ్యాక్సిన్ లేకపోవడం వల్లే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.

ఈ వైరస్ మే 2026లో కాంగోలోని ఇటూరి ప్రాంతంలో మొదటగా గుర్తించబడింది. ఈ ప్రాంతం దీర్ఘకాలంగా సాయుధ తిరుగుబాట్లు, అంతర్గత హింసతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి బంగారు గనుల్లో పనిచేసే కార్మికులు, శరణార్థుల నిరంతర వలసల కారణంగా వైరస్ చాలా వేగంగా ఇతర ప్రాంతాలైన నార్త్ కివు, సౌత్ కివులకు విస్తరించింది. విచిత్రమైన విషయం ఏంటంటే, తూర్పు కాంగోలో తిరుగుబాటుదారుల హింస కారణంగా వైద్య బృందాలు బాధితులకు కనీస చికిత్స కూడా అందించలేకపోతున్నాయి. ఇటూరి ప్రాంతంలోని ఒక జనరల్ ఆస్పత్రిపై సాయుధ దుండగులు వరుసగా రెండు రోజులు దాడులు చేసి, ఐసోలేషన్ టెంట్లు తగలబెట్టడంతో చికిత్స పొందుతున్న 18 మంది ఎబోలా రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారు. అందులో ఒకరికి ఎబోలా పాజిటివ్ అని తేలింది. వాడు ప్రజల్లో తిరుగుతుండటంతో వైరస్ మరింత వేగంగా వ్యాపించే ముప్పు పొంచి ఉంది.

కాంగోలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పొరుగు దేశమైన ఉగాండా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు దాటి వస్తున్న కాంగో శరణార్థుల వల్ల ఉగాండాలోని స్థానిక ఆరోగ్య సిబ్బందికి కూడా ఈ అరుదైన వైరస్ సోకుతుండటంతో.. ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్కా అలుపో నేతృత్వంలోని హై-లెవల్ టాస్క్‌ఫోర్స్ కాంగోతో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా కాంగో నుంచి వచ్చే విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. ఉగాండా రాజధాని కంపాలాలో మే 14న ఎబోలా మొదటి కేసు నమోదైన 59 ఏళ్ల వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ కరచాలనం చేయవద్దని, శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఎబోలా సోకి చనిపోయిన వారి మృతదేహాలు అత్యంత సంక్రామ్యత కలిగి ఉంటాయని, రక్షణ కవచాలు లేకుండా అంత్యక్రియలు చేస్తే ఊరు మొత్తం వైరస్ విస్తరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆఫ్రికాలో ఎబోలా విజృంభణ నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విమానాశ్రయాలలో కోవిడ్ తరహా కఠినమైన ప్రోటోకాల్స్ అమలు చేస్తూ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు భారతీయులు ఎవరూ ప్రయాణాలు చేయవద్దని సూచించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్స్ తప్పనిసరి చేసింది. కేరళ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి, ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి 21 రోజుల క్వారంటైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే క్రమంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎబోలా కలకలం రేగింది. కాంగో దేశం నుంచి గుజరాత్‌కు వచ్చిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు మరో ముగ్గురికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో గుజరాత్ ప్రభుత్వం వారిని వెంటనే అహ్మదాబాద్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులకు తరలించింది. వారి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా తెలిపారు. మరోవైపు ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఒక మహిళలో స్వల్ప ఒంటి నొప్పులు ఉండటంతో అధికారులు ఆమెను అంటువ్యాధుల ఆసుపత్రిలో ఐసోలేషన్ చేసి పరీక్షలు నిర్వహించారు. లక్కీగా ఆమెకు నెగెటివ్ రావడంతో బెంగళూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘోరమైన అంటువ్యాధి సరిహద్దులు దాటి ప్రపంచమంతటా విస్తరించకుండా అంతర్జాతీయ సమాజం రక్షణ చర్యలు చేపట్టింది. ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్న అంగోలా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇథియోప్యియా, కెన్యా, రువాండా, సౌత్ సూడాన్, టాంజానియా, జాంబియా సహా 9 దేశాలను హై రిస్క్ కేటగిరీలో పెట్టింది. ఈ వైరస్ ట్రాకింగ్ కోసం యూరోపియన్ యూనియన్ ఆఫ్రికా సీడీసీకి 2 మిలియన్ యూరోల (సుమారు రూ.22 కోట్లు) అత్యవసర నిధులను విడుదల చేసింది. యూరప్ దేశాలు ఆఫ్రికా ప్రయాణికుల కోసం స్పెషల్ ప్యాసింజర్ ట్రాకింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశాయి. అమెరికా, కెనడా దేశాలు కూడా ఆఫ్రికా పౌరుల వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఎబోలా అసలు ఎలా వ్యాపిస్తుంది?

ఎబోలా వైరస్ మొట్టమొదటిసారిగా 1976లో ఆఫ్రికాలో వెలుగుచూసింది. ఇది ప్రాణాంతకమైన జూనోటిక్ (జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే) వైరస్. అడవుల్లో ఉండే గబ్బిలాలు, చింపాంజీలు, గొరిల్లాలు, కోతుల శరీర ద్రవాలు లేదా రక్తం ద్వారా ఇది మొదట మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, శ్వాస, వారు వాడిన బట్టలు, మంచం ద్వారా ఇతర మనుషులకు వేగంగా వ్యాపిస్తుంది. ఎబోలా సోకిన ప్రారంభంలో తీవ్రమైన జ్వరం, నీరసం, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు వస్తాయి. ఈ లక్షణాలు సాధారణ మలేరియా లేదా డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉండటం వల్ల దీనిని ప్రారంభంలో గుర్తించడం చాలా కష్టం. వ్యాధి ముదిరిన తర్వాత వాంతులు, విరేచనాలు మరియు అంతర్గతంగా, బాహ్యంగా (ముక్కు, నోరు, కళ్ల నుంచి) విపరీతంగా రక్తం కారడం లాంటి భయంకరమైన లక్షణాలు కనిపిస్తాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story