Eswatini HIV Crisis: మృత్యువుతో పోరాడుతున్న ఆ చిన్న దేశం కథ ఏంటో తెలుసా?
Eswatini HIV Crisis: ప్రపంచపటంలో దక్షిణాఫ్రికా సరిహద్దుల్లో ఉండే ఒక చిన్న దేశం ఇప్పుడు మానవాళికి పెను సవాలుగా మారింది.
Eswatini HIV Crisis
Eswatini HIV Crisis: ప్రపంచపటంలో దక్షిణాఫ్రికా సరిహద్దుల్లో ఉండే ఒక చిన్న దేశం ఇప్పుడు మానవాళికి పెను సవాలుగా మారింది. కేవలం 12 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఏకంగా 3 లక్షల మంది ఒకే భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు మరణశాసనాన్ని మోస్తున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశమే ఎస్వతిని. అగ్రరాజ్యాలు సైతం విస్తుపోయేలా అక్కడ వ్యాధి ఎందుకు విస్తరిస్తోంది? సంప్రదాయాలే ఆ దేశానికి శాపంగా మారాయా? ఈ కథనంలో లోతుగా తెలుసుకుందాం.
ఎస్వతిని: మృత్యువు గుప్పిట్లో యువత
పూర్వం స్వాజిలాండ్ అని పిలవబడే ఎస్వతిని దేశం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ వ్యాప్తి ఉన్న దేశంగా రికార్డులకెక్కింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఇక్కడ 15 నుండి 49 ఏళ్ల మధ్య వయసున్న యువతలో ఈ వ్యాధి తీవ్రత అత్యధికంగా ఉంది. ఏటా కొత్తగా 7 వేల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒక చిన్న దేశంలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటం ప్రపంచ ఆరోగ్య సంస్థను సైతం కలవరపెడుతోంది. ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత ఈ వ్యాధి కోరల్లో చిక్కుకోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుంగదీస్తోంది.
పేదరికం , వలసల శాపం
ఎస్వతినిలో దాదాపు 60 శాతం మంది ప్రజలు అత్యంత దయనీయమైన పేదరికంలో మగ్గిపోతున్నారు. సరైన ఉపాధి లేక ఇక్కడి పురుషులు , మహిళలు పొరుగున ఉన్న దక్షిణాఫ్రికాలోని గనుల్లో కూలీ పనుల కోసం వలస వెళ్తుంటారు. అక్కడ గనుల యజమానులు , ఇతర కార్మికుల వద్ద నిరుపేద మహిళలు తమ అవసరాల కోసం లొంగిపోవాల్సి వస్తోంది. సురక్షితం కాని శృంగార పద్ధతులు, కనీస అవగాహన లేకపోవడం వల్ల ఈ మహమ్మారి వారి ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించింది. పేదరికం నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే వారి ప్రాణాల మీదకు తెస్తోంది.
సంప్రదాయాల మాటున పొంచి ఉన్న ప్రమాదం
ఈ దేశంలో 'రీడ్ డ్యాన్స్' (రెల్లు నృత్యం) అనే ఒక వింత సంప్రదాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ నృత్యాన్ని చూడటానికి వస్తుంటారు. అయితే, ఈ వేడుకల సమయంలో జరిగే విచ్చలవిడి శృంగారం వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశ రాజు సైతం ప్రతి ఏటా ఈ వేడుకలో ఒక యువతిని ఎంచుకుని వివాహం చేసుకోవడం ఇక్కడ అనవాయితీ. బహుభార్యత్వం సర్వసాధారణం కావడంతో, ఒకరి నుండి మరొకరికి వ్యాధి చాలా వేగంగా సంక్రమిస్తోంది. అనాదిగా వస్తున్న ఈ పద్ధతులను మార్చుకోవడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా లేకపోవడం అధికారులకు పెద్ద తలనెప్పిగా మారింది.
చిన్న వయసులోనే పెడదోవ
పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై జరిగిన ఒక సర్వే విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. దాదాపు 18 శాతం మంది విద్యార్థులు తమ స్కూలు వయసులోనే తొలిసారి శృంగారంలో పాల్గొన్నామని అంగీకరించారు. సరైన లైంగిక విద్య లేకపోవడం, సామాజిక కట్టుబాట్లు బలహీనపడటం వల్ల చిన్న వయసులోనే యువత పెడదోవ పడుతున్నారు. ఇది భవిష్యత్తు తరాలను హెచ్‌ఐవీ రొంపిలోకి నెట్టివేస్తోంది.
ప్రాణాలకు అందని మందు
హెచ్‌ఐవీ నివారణలో , వ్యాధి సోకిన వారి ప్రాణాలను కాపాడటంలో 'లెనాకాపవిర్' అనే మందు అత్యంత కీలకం. గ్లోబల్ ఫండ్ ద్వారా ఎస్వతినికి ఏటా 6 వేల డోసులు అందాల్సి ఉండగా, ప్రస్తుతం అందులో సగం మాత్రమే అందుతున్నాయి. మందుల కొరత వల్ల చికిత్స తీసుకోవాల్సిన వేలాది మంది నిరాశలో ఉన్నారు. ఒకవైపు వ్యాధి విస్తరణ, మరోవైపు మందుల కొరత ఈ దేశాన్ని ఇరుకాటంలో పడేసింది.
చిన్న ఆశ: మరణాల రేటు తగ్గుదల
ఇన్ని కష్టాల మధ్య కూడా ఒక సానుకూల అంశం కనిపిస్తోంది. గత 20 ఏళ్లుగా ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు, అవగాహన సదస్సుల వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాధి సోకిన వారిలో అత్యధికులకు చికిత్స అందించగలుగుతున్నారు. దీనివల్ల బాధితులు మరికొంత కాలం జీవించే అవకాశం కలుగుతోంది. ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినా, వ్యాధి వ్యాప్తిని అరికట్టలేకపోవడం మాత్రం ఆ దేశానికి ఇప్పటికీ అతిపెద్ద సవాలుగానే మిగిలిపోయింది.
కేవలం మందుల ద్వారానే కాకుండా, సామాజిక మార్పు ద్వారా మాత్రమే ఎస్వతిని ఈ మృత్యుపాశం నుండి బయటపడగలదు.




