Europe Heatwave Crisis: యూరప్‌ను భయపెడుతున్న వెదర్‌... ఫ్రాన్స్‌లో 18 మంది మృతి

యూరప్‌ను తీవ్ర హీట్‌వేవ్ వణికిస్తోంది. ఫ్రాన్స్‌లో 18 మంది మృతి చెందగా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Balachander
Published on: 23 Jun 2026 12:24 PM IST
Europe Heatwave Crisis: యూరప్‌ను భయపెడుతున్న వెదర్‌... ఫ్రాన్స్‌లో 18 మంది మృతి
X

Europe Heatwave Crisis: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న తరుణంలో పారిశ్రామిక దేశాల కూటమి అయిన యూరప్ ఖండాన్ని తీవ్రమైన హీట్‌వేవ్ వణికిస్తోంది. నైరుతి ఐరోపా దేశాల్లో నమోదవుతున్న అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్‌లో ఒక్కరోజే ఇద్దరు చిన్నారులతో సహా కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని దశాబ్దాల రికార్డులను తిరగరాస్తూ ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ దేశాలు నిప్పుల కొలిమిలా మారాయి. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని 'ఒమేగా బ్లాక్' పరిస్థితిగా అభివర్ణిస్తున్నారు.

ఫ్రాన్స్‌లో విషాదం ... మరణాల వెనుక కారణాలు

ఫ్రాన్స్ వాతావరణ కేంద్రం నివేదికల ప్రకారం శతాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నాడు బోర్డో నగరంలో గరిష్టంగా 41.9 డిగ్రీల సెల్సియస్, పాయిటియర్స్ లో 41.2 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైంది. ఇది 1947 నాటి రికార్డులను సైతం అధిగమించింది. ఆగ్నేయ ఫ్రాన్స్‌లో ఎండ తీవ్రతకు కారు లోపల ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో ఊపిరాడక 2, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులు మరణించారు. అంతేకాదు, బోర్డో ప్రాంతంలో వయసు పైబడిన వారు హీట్ స్ట్రోక్ తట్టుకోలేక ముగ్గురు ప్రాణాలు విడిచారు. వేడి నుంచి ఉపశమనం కోసం నదులు, సరస్సులలో ఈతకు వెళ్లిన వారిలో 13 మంది మునిగిపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఫ్రాన్స్‌లో మునిగిపోయే మరణాల సంఖ్య 172 శాతం పెరగడం గమనార్హం.

ఏంటి ఈ 'ఒమేగా బ్లాక్'?

లండన్ ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తల ప్రకారం...గ్రీకు అక్షరం 'ఒమేగా' ఆకారంలో సహారా ఎడారి నుండి వేడి గాలి ఒక పెద్ద బుడగలా యూరప్ పైభాగానికి నెట్టబడింది. దీనివల్ల గాలి కదలికలు పూర్తిగా స్తంభించిపోయి, తీవ్రమైన ఉష్ణతీవ్రత ఒకే చోట కేంద్రీకృతమైంది.

ఇతర దేశాల పరిస్థితి... అలర్ట్ లు, పవర్ కట్స్

జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్‌లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉండటంతో 1957, 1976 నాటి రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. అదేవిధంగా స్పెయిన్‌లో చల్లటి వాతావరణం ఉండే సాన్ సెబాస్టియన్ నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. ఇది అక్కడి సగటు కంటే రెట్టింపు. అంతేకాదు, ఇటలీ దేశంలోని 12 ప్రధాన నగరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. టురిన్ నగరంలో ఎయిర్ కండిషనర్ల వాడకం విపరీతంగా పెరగడంతో విద్యుత్ గ్రిడ్ పై ఒత్తిడి పడి పవర్ కట్స్ విధిస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు, ఇంధన వాడకం వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇప్పుడు యూరప్ దేశాల ఆర్థిక, సామాజిక జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ కొరత, మౌలిక వసతుల క్షీణతను ఎదుర్కోవడానికి ఐరోపా దేశాలు అత్యవసర చర్యలు చేపడుతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story