Heatwave: భానుడి ప్రతాపానికి యూరప్ విలవిల.. వడగాల్పులతో 50 వేల మందికి పైగా మృతి!

Heatwave: ఐరోపాలో తీవ్రమైన ఎల్‌నినో, వాతావరణ మార్పుల వల్ల వడగాలులు పెరిగి జూన్-ఆగస్టు మధ్య 50,000 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 11:05 AM IST
Heatwave
X

Heatwave: భానుడి ప్రతాపానికి యూరప్ విలవిల.. వడగాల్పులతో 50 వేల మందికి పైగా మృతి!

Heatwave: సాధారణంగా శీతల వాతావరణానికి మారుపేరైన ఐరోపా (Europe) ఖండం వేసవి తీవ్రతకు, భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. తీవ్రమైన ఎల్‌నినో ప్రభావం మరియు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల దాటికి యూరప్ దేశాలు తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వేడిగాలులు మరియు వడదెబ్బ కారణంగా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య రికార్డు స్థాయిలో 50,000 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.

శిలాజ ఇంధనాల వాడకం వల్ల పెరుగుతున్న కాలుష్యం, దాంతో తలెత్తుతున్న తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగానే ఈ 50 వేల మరణాల్లో సుమారు 32,600 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. ఒక్క యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోనే ఈ వేసవి కాలంలో 4,354 మరణాలు నమోదవగా, అందులో అత్యధికులు వృద్ధులే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. యూకేతో పాటు బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈసారి ఐరోపా ఎదుర్కొంటున్న వడగాడ్పులు చరిత్రలోనే అతి దారుణమైనవని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా కదులుతున్న వేడి గాలులు, దీనికి తోడు ఎల్‌నినో ఎఫెక్ట్ తోడవ్వడంతో యూరప్‌లో 'హీట్ డోమ్' పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో యూరప్ దేశాలు విఫలమయ్యాయని, అందుకే ఈ స్థాయి ప్రాణనష్టం సంభవించిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా యూరప్ దేశాలు సమన్వయంతో వేగవంతమైన వాతావరణ రక్షణ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని తీవ్రంగా హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.