Europe Heatwave: యూరప్‌లో హీట్‌వేవ్ కలకలం.. వడదెబ్బకు 1,300 మందికి పైగా బలి!
Europe Heatwave: ఐరోపా ఖండంలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు.
Europe Heatwave: యూరప్‌లో హీట్‌వేవ్ కలకలం.. వడదెబ్బకు 1,300 మందికి పైగా బలి!
Europe Heatwave: శీతల దేశాలకు మారుపేరైన ఐరోపా (Europe) ఖండం ప్రస్తుతం భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో యూరప్ దేశాలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జూన్ 21 నుంచి ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా రికార్డు స్థాయిలో 1,300 మందికి పైగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారికంగా ప్రకటించింది.
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోందని పలు ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తీవ్రమైన ఎండల ప్రభావం అక్కడి ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఒక్క ఫ్రాన్స్ దేశంలోనే గత బుధవారం నాటికే 1,000 మందికి పైగా ప్రజలు ఎండల తీవ్రత తట్టుకోలేక చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
యూరప్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతమైన వేడి ఒక "నిశ్శబ్ద హంతకి" (Silent Killer) లా మారిందని ఆయన అభివర్ణించారు.
ఐరోపాలోని ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలలు అధిక వేడిని తట్టుకునే విధంగా నిర్మించబడలేదు. దీనివల్ల ప్రజలు ఇళ్లలో సైతం ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది మంది ప్రజలు నిరంతరం అధిక వేడి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి, పవర్ గ్రిడ్స్ కుప్పకూలి విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
"ఒక తరంలో ఎప్పుడో ఒకసారి కనిపించే వాతావరణ మార్పులు, భూతాపం వంటి విపత్తులు ఇప్పుడు ప్రతి ఏటా కనిపిస్తున్నాయి. ఈ భూమిపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం ఐరోపానే. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇక్కడ వేడి రెండింతలు పెరిగింది." అని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు.
ఈ ఆదివారం ఐరోపా వ్యాప్తంగా కనీసం 19 కోట్ల మంది ప్రజలు సగటున 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ఎదుర్కోవాల్సి రావచ్చని 'ఏఎఫ్పీ' (AFP) నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా జర్మనీ, చెక్‌రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధత, ముందస్తు నివారణ చర్యలు, బలమైన ఆరోగ్య వ్యవస్థలపై దృష్టి సారించనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి (UN) తన సభ్యదేశాలతో కలిసి పనిచేస్తోందని వెల్లడించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో యూరోపియన్ దేశాలు తక్షణమే స్పందించి, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని పిలుపునిచ్చింది.




