Europe Wildfires: యూరప్‌లో ఎగిసిపడుతున్న మంటలు... భయం గుప్పిట ఫ్రాన్స్‌, స్పెయిన్‌

యూరప్‌లో వేడిగాలుల తీవ్రత అధికమైంది. దీంతో అడవుల్లో మంటలు అంటుకొని మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్నాయి. ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.

Balachander
Published on: 25 July 2026 9:12 AM IST
Europe Wildfires: యూరప్‌లో ఎగిసిపడుతున్న మంటలు... భయం గుప్పిట ఫ్రాన్స్‌, స్పెయిన్‌
X

Europe Wildfires: వేడిగాలుల కారణంగా యూరప్‌లో ఎగిసిపడుతున్న మంటలు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలను అగ్నిగుండంగా మార్చాయి. తీవ్రమైన వేడి గాలులు, పొడి వాతావరణం కారణంగా అగ్నికీలలు భారీ ఎత్తున వ్యాపిస్తున్నాయి. దీని నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి ఇప్పటివరకు ఏకంగా 2,200,00 కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. తీవ్రస్థాయిలో మండుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది. అత్యవసర సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. పైగా పొడి వాతావరణం ఉండటం మంటల వ్యాప్తికి అనుకూలంగా మారింది.

ఫ్రాన్స్‌లో బీభత్సం

నైరుతి ఫ్రాన్స్‌లోని జిరోండే, లాండేస్ ప్రాంతాలలో మంటలు ఉగ్రరూపం దాల్చాయి. తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ రక్షణ చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు. జిరోండే పరిసర ప్రాంతాల్లో 2,00,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో ఒక్క బోర్డో నగరం సమీపంలోని నాలుగు పట్టణాల నుంచే 60,000 మంది ఉన్నారు. ఈ అగ్నిప్రమాదాల వల్ల 19,000 హెక్టార్ల అంటే 46,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. దాదాపు 80 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంతేకాదు, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన క్యాప్ ఫెర్రెట్ ద్వీపకల్పం నుంచి వందలాది మంది ప్రజలు పడవల ద్వారా ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బయటపడ్డారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇటువంటి వాతావరణ పరిస్థితులను చూడలేదని ప్రజలు వాపోతున్నారు.

స్పెయిన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి

రాజధాని మాడ్రిడ్ సమీపంలో మూడు వేర్వేరు చోట్ల రగులుకున్న మంటలు ఒకదానితో ఒకటి కలిసిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది నియంత్రించలేని స్థాయికి పరిస్థితి చేరుకుంది. దీంతో స్పెయిన్ ప్రభుత్వం దేశంలో 'జాతీయ అత్యవసర పరిస్థితి' ప్రకటించింది. మాడ్రిడ్ ప్రాంతీయ అధ్యక్షురాలు ఇసాబెల్ డియాజ్ ఆయుసో ఈ పరిస్థితిని "ప్రాంతీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన అగ్నిప్రమాదం"గా అభివర్ణించారు. ఉష్ణోగ్రతలు, ఈదురుగాలులు, వ్యాపిస్తున్న మంటలు కలసి పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. స్పెయిన్‌లో 25,000 మందికి పైగా ఇళ్లను ఖాళీ చేయగా, మరో 40,000 మందిని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మాడ్రిడ్‌లో 6,000 హెక్టార్లు, పొరుగున ఉన్న ఆవిలా ప్రాంతంలో 9,000 హెక్టార్ల భూమి మంటల్లో దగ్ధమైంది.

వాతావరణ మార్పుల హెచ్చరిక

వాతావరణ మార్పుల కారణంగా 1980ల తర్వాత అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్ నిలిచింది. యూరోపియన్ యూనియన్ కు చెందిన క్లైమేట్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం, గత రెండు దశాబ్దాల సగటుతో పోలిస్తే ఈ ఏడాది వ్యాపించిన దావానలాల తీవ్రత చాలా ఎక్కువ. ఈ తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ సైనిక హెలికాప్టర్లను, అత్యవసర విమానాలను రంగంలోకి దించింది. యూరప్‌లోని ఈ రెండు దేశాల పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న మిగిలిన దేశాలు సత్వర చర్యలు చేపడుతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story