Bird Behavior: షాకింగ్ రీసెర్చ్.. పురుషులు ఓకే మహిళలను చూస్తేనే పారిపోతున్న పక్షులు

Bird Behavior: పురుషులతో పోలిస్తే మహిళలను చూసినప్పుడు పక్షులు మరింత వేగంగా ఎగిరిపోతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.

CR Reddy
Published on: 24 Oct 2026 6:12 AM IST
Bird Behavior
X

Bird Behavior

Bird Behavior: ప్రకృతిలో పక్షుల ప్రవర్తన ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక కొత్త అంతర్జాతీయ పరిశోధనలో ఎవరికీ ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. పురుషులతో పోలిస్తే మహిళలను చూసినప్పుడు పక్షులు మరింత వేగంగా ఎగిరిపోతున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. బ్రిటిష్ ఎకాలజికల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సైంటిఫిక్ స్టడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను విస్మయానికి గురిచేస్తోంది. పురుషులు తమకు మరింత దగ్గరగా వచ్చేందుకు పక్షులు అవకాశం ఇస్తుండగా, మహిళలు సమీపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తమై పారిపోతున్నాయి.

వివిధ దేశాలలో ఒకే రకమైన పక్షుల ప్రవర్తన

చెకియా, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ అలాగే స్పెయిన్ దేశాలలోని వివిధ నగరాల్లో ఈ పరిశోధనను సాగించారు. సులభంగా భయపడే మ్యాగ్‌పై పక్షుల నుంచి నిత్యం మన చుట్టూ తిరిగే పావురాల వరకు దాదాపు 37 రకాల పక్షుల జాతులపై ఈ పరిశీలన జరిపారు. ఎక్కడ చూసినా పక్షుల ప్రవర్తనలో ఇదే తీరు కనిపించింది. పురుషులు మహిళల కంటే దాదాపు ఒక మీటర్ అదనంగా దగ్గరకు వెళ్లే వరకు పక్షులు అక్కడే ఉంటున్నాయి. కానీ మహిళలు సమీపించేసరికి మాత్రం ఆ దూరం కంటే ముందే హెచ్చరికతో ఎగిరిపోతున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

శాస్త్రవేత్తలకు అంతుచిక్కని వైనం

నగరాల్లో నివసించే పక్షులు మనుషులలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించగలవని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే పక్షులు మనుషులలోని ఏ ప్రత్యేక లక్షణాలను బట్టి ఇలా ప్రవర్తిస్తున్నాయి, లేక మహిళల చుట్టూ ఉన్నప్పుడు ఎందుకు అంతగా అప్రమత్తంగా ఉంటున్నారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ పరిశోధనలో భాగమైన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డానియెల్ బ్లుమ్‌స్టీన్ మాట్లాడుతూ, తాము వాడిన ఆధునిక విశ్లేషణ పద్ధతుల ద్వారా ఫలితాలు చాలా పక్కాగా వచ్చాయని, కానీ దీనికి గల కచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

అర్బన్ ఎకాలజీపై పడుతున్న ప్రభావం

ఈ విచిత్రమైన అంశంపై చెక్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్ రీసెర్చర్ డాక్టర్ యానినా బెనెడెట్టి మాట్లాడుతూ.. ఈ పరిశోధన జంతువులు మనుషులను ఏ కోణంలో చూస్తున్నాయనే దానిపై సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తోందని తెలిపారు. ఈ అధ్యయనం కేవలం పక్షుల ప్రవర్తనను మాత్రమే కాకుండా, అర్బన్ ఎకాలజీ అలాగే సైన్స్‌లో సమానత్వం వంటి అంశాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. భవిష్యత్తులో జరిగే మరిన్ని పరిశోధనల ద్వారా దీని వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.