రన్‌వే దాటిన కార్గో విమానం.. మియామీ ఎయిర్‌పోర్టులో కలకలం!

Miami International Airport: అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఓ కార్గో విమానం రన్‌వే దాటి ముందుకు దూసుకెళ్లింది.

G Krishna
Published on: 26 Nov 2026 1:56 PM IST
Miami International Airport
X

రన్‌వే దాటిన కార్గో విమానం.. మియామీ ఎయిర్‌పోర్టులో కలకలం!

Miami International Airport: అమెరికాలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఓ కార్గో విమానం రన్‌వే దాటి ముందుకు దూసుకెళ్లింది. థాంక్స్‌గివింగ్ సెలవుల రద్దీ ప్రయాణ సమయం కావడంతో ఈ ఘటన విమానాశ్రయ కార్యకలాపాలపై ప్రభావం చూపింది. రాత్రి సుమారు 8.40 గంటలకు ఫెడెక్స్‌కు చెందిన విమానం రన్‌వే 26ఆర్ పరిధి దాటినట్లు విమానాశ్రయ అధికారులు 'ఎక్స్' ద్వారా వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.

రన్‌వేల మూసివేత.. సాధారణ సేవల పునరుద్ధరణకు ప్రయత్నాలు

ఈ ఘటన నేపథ్యంలో ఒక రన్‌వే మినహా మిగిలిన రన్‌వేలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు ఓపిక వహించాలని, సాధారణ కార్యకలాపాలను సురక్షితంగా తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. మియామీలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికా విమానయాన రంగంలో వరుస ఇబ్బందులు

ఇటీవలి వారాల్లో అమెరికా విమానయాన రంగం వరుస సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నవంబర్ 13న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన లోపాల వల్ల దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను గంటల తరబడి నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్న వేళ ఈ రన్‌వే ఘటన మరో సమస్యగా మారింది.

థాంక్స్‌గివింగ్ వేళ ప్రతికూల వాతావరణం.. దేశవ్యాప్తంగా ప్రభావం

అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే థాంక్స్‌గివింగ్ సెలవు వారాంతంలో సుమారు 8 కోట్ల మంది రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఈ సమయంలో ప్రతికూల వాతావరణం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. దేశ ఈశాన్య ప్రాంతాన్ని తుపాను తాకే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో న్యూయార్క్‌లో జరిగే మేసీస్ థాంక్స్‌గివింగ్ డే పరేడ్‌ను తొలిసారిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 'కింగ్ టైడ్స్' కారణంగా తీర ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. 30 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతుండటంతో ప్రజలను ఖాళీ చేయించడంతో పాటు అక్కడి విమానాశ్రయాలు మూతపడే ప్రమాదం కూడా నెలకొంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.