White House Shooting : వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం..తుపాకీతో దుండగుడు హల్చల్.. ట్రంప్ సేఫ్
White House Shooting : అమెరికాలోని వైట్ హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం భారీ కాల్పులు జరిగాయి. సీక్రెట్ సర్వీస్ జరిపిన ఎదురుకాల్పుల్లో అనుమానితుడు మృతి చెందగా, అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారు.
White House Shooting
White House Shooting : అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో శనివారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ ప్రాంగణానికి సమీపంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినపడటంతో అక్కడి భద్రతా సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సదరు అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కాల్పుల సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక సాధారణ పౌరుడికి కూడా బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది.
అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం వైట్ హౌస్‌కు కేవలం ఒక బ్లాక్ దూరంలో ఉన్న 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ, ఒక్కసారిగా తన చేతిలో ఉన్న బ్యాగులోంచి పవర్‌ఫుల్ గన్ తీసి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నారు. కాల్పుల శబ్దం వినపడగానే భద్రతా బలగాలు అధ్యక్షుడి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి.
ఈ హై-ప్రొఫైల్ కాల్పుల ఘటనపై అమెరికా గూఢచార సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. భద్రతా సంస్థలు, ఎఫ్‌బీఐ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. సీక్రెట్ సర్వీస్ సమన్వయంతో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చామని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రజలకు మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తాన్ని ఆర్మీ కంట్రోల్‌లోకి తీసుకుంది. వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీసులు, నిఘా వర్గాలు నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతడికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నాయి.
కాల్పులు జరిగిన సమయంలో వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లో ఉన్న జర్నలిస్టులు వరుసగా బుల్లెట్ల శబ్దాలు విన్నట్లు తెలిపారు. శబ్దం వినపడగానే సీక్రెట్ సర్వీస్ కమాండోలు ప్రెస్ రూమ్ తలుపులు మూసివేసి, విలేకరులు ఎవరూ బయటకు రాకుండా లాక్ చేశారు. దాదాపు గంటకు పైగా పీఎంఓ ప్రెస్ గ్యాలరీని భద్రతా బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. నిందితుడి దాడి వెనుక అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వైట్ హౌస్ చుట్టుపక్కల వీధుల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనతో వాషింగ్టన్ డీసీ వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.




