Flights cancelled: విమానయాన రంగంలో సంక్షోభం.? 20 వేల ఫ్లైట్స్ రద్దు చేసిన సంస్థ
Flights cancelled: జర్మనీకి చెందిన లుఫ్తాన్స గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ వరకు దాదాపు 20,000 విమానాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.
Flights cancelled
Flights cancelled: జర్మనీకి చెందిన లుఫ్తాన్స గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ వరకు దాదాపు 20,000 విమానాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా జెట్ ఇంధన ధరలు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఇప్పుడీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
లుఫ్తాన్స్ తీసుకున్న నిర్ణయం ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ రద్దులతో సమ్మర్ సీజన్‌లో విమాన సామర్థ్యం కొంత తగ్గుతుంది. ముఖ్యంగా తక్కువ లాభం ఇచ్చే షార్ట్ రూట్ విమానాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
యూరప్‌లో ప్రభావిత నగరాలు
ఈ మార్పుల వల్ల యూరప్‌లోని కొన్ని ప్రధాన నగరాల మధ్య విమానాలు తగ్గనున్నాయి. ముఖ్యంగా ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిక్, జ్యూరిచ్, వియన్నా, బ్రస్సెల్స్, రోమ్ వంటి నగరాల మధ్య రూట్లు సర్దుబాటు చేయనున్నారు. కొన్ని చిన్న నగరాలకు వెళ్లే విమానాలు తాత్కాలికంగా నిలిపివేశారు. పోలాండ్‌లోని బైడ్జోసిసాజ్, రెజెస్‌వో అలాగే నార్వేలోని స్టొవేజర్ రూట్లు ప్రస్తుతం షెడ్యూల్‌లో లేవు.
ఇంధన ఖర్చు తగ్గింపు లక్ష్యం
ఈ నిర్ణయం ద్వారా కంపెనీ సుమారు 40,000 మెట్రిక్ టన్నుల జెట్ ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెట్ ఫ్యూయల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటోంది. కేఎల్ఎమ్, ఎయిర్ కెనెడా, సింగపూర్ ఎయిర్‌లైన్స్, యూనైటెడ్ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు కూడా ఇదే మార్గంలో వెళ్లనున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ పరిస్థితి విమానయాన రంగంలో సంక్షోభానికి తెర తీయనుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.
ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం పడనుంది.?
ఇప్పటికే రోజుకు 120 విమానాలు రద్దు చేసినట్లు సంస్థ వెల్లడించింది. మే చివరి వరకు ఈ మార్పులు కొనసాగుతాయి. ప్రభావిత ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇచ్చామని తెలిపింది. లాంగ్ హాల్ విమానాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. అలాగే యూరప్ నెట్‌వర్క్‌లో రూట్లను కలిపి ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగించేలా ప్లాన్ చేసింది. మరుసటి నెలల్లో కొత్త షెడ్యూల్ విడుదల కానుంది. సమ్మర్ సీజన్ మొత్తం స్థిరమైన సేవలు అందించేలా ఈ మార్పులు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.




