FlyDubai Attack: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ పై దాడి చేసిన ఉగ్రవాది గుర్తింపు

FlyDubai Attack: అంతర్జాతీయ విమానయాన రంగంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

CR Reddy
Published on: 3 Oct 2026 8:32 AM IST
FlyDubai Attack
X

FlyDubai Attack

FlyDubai Attack: అంతర్జాతీయ విమానయాన రంగంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్‌గా ఉండి తోటి పైలట్‌పై కిరాతకంగా దాడి చేసిన నిందితుడిని అరబ్ మీడియా గుర్తించింది. ఆ నిందితుడు ఒమాన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామిగా నిర్ధారించారు. అతడికి గతంలోనే అనుమానాస్పద చరిత్ర ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అరబ్ మీడియా కథనాల ప్రకారం.. హమామ్ అల్-హమ్మామి గతంలోనే తీవ్రవాద భావజాలం ఉన్న వెబ్‌సైట్లను విసృతంగా పరిశీలించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అతని ఈ ప్రమాదకరమైన అలవాటు కారణంగా 2024-25 మధ్యకాలంలో ఒమన్ ఎయిర్ సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే సరైన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ చేయకుండానే ఫ్లైదుబాయ్ సంస్థ అతనికి ఉద్యోగం ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అమెరికన్ మీడియా నివేదికల ప్రకారం కూడా ఈ వ్యక్తిని సెక్యూరిటీ పరంగా ముందే ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించారు.

సౌదీ అరేబియా గగనతలంలో సుమారు 33,000 నుంచి 34,000 అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచార్‌పై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామంతో విమానంలో తీవ్ర గందరగోళం నెలకొంది. తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచార్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోరారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులు కలిసి దాడికి పాల్పడిన కో-పైలట్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రమాదకర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచార్ ధైర్యసాహసాలను ప్రపంచ దేశాల అధినేతలు కొనియాడుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కెప్టెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. వీడియో కాల్ ద్వారా కెప్టెన్‌ను పరామర్శించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్మిత్ మచార్‌ను రియల్ హీరోగా అభివర్ణించారు. సౌదీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం యూఏఈకి తరలించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.