FlyDubai: కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి.. ఆ చిన్నారి చూసిన భయానక దృశ్యం!
FlyDubai: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కాక్‌పిట్ గొడవ కలకలం రేపింది.
FlyDubai: కాక్‌పిట్‌లో పైలట్‌పై దాడి.. ఆ చిన్నారి చూసిన భయానక దృశ్యం!
FlyDubai: దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరిన ‘ఫ్లై దుబాయ్’ (FlyDubai) విమానంలో బుధవారం జరిగిన అనూహ్య ఘటనకు సంబంధించిన మరిన్ని భయానక నిజాలు ఒక్కటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రయాణ సమయంలో కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఘర్షణ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
విమానం గాల్లో ఉండగా.. టెల్‌అవీవ్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి నీనా మానీస్ టాయిలెట్‌కు వెళ్లింది. అదే సమయంలో కొద్దిగా తెరిచి ఉన్న కాక్‌పిట్ లోపలి దృశ్యాన్ని చూసి ఆ చిన్నారి ఒక్కసారిగా భయంతో ‘డాడ్..’ అంటూ గట్టిగా కేకలు వేసింది. ముందు వరుసలో కూర్చున్న ఆమె తండ్రి జ్వీకా మానీస్ ఏం జరిగిందో అర్థంకాక వెంటనే టాయిలెట్ వైపు పరుగులు తీశారు.
జ్వీకా మానీస్ అనుభవం ఆయన మాటల్లోనే:
"పాక్షికంగా తెరిచి ఉన్న డోర్ గుండా కాక్‌పిట్‌లోకి చూస్తే ఆ దృశ్యం అత్యంత భయానకంగా ఉంది. కత్తిపోట్లతో రక్తమోడుతున్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్.. ఒమానీ కో-పైలట్‌తో పోరాడుతున్నారు."
అతి కష్టం మీద తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన పైలట్, దాడిని ఎదుర్కొంటూనే కిందపడిపోయారు. అప్రమత్తమైన ప్రయాణికులు అసఫ్ రజువాన్, యానివ్ హయూన్‌లతో పాటు జ్వీకా మానీస్ ముందుకు వచ్చి సాహసం ప్రదర్శించారు. ముగ్గురూ కలిసి కో-పైలట్‌ను గట్టిగా పట్టుకుని, విమానంలోని హెడ్‌ఫోన్ కేబుల్‌తో అతడిని బంధించారు.
ఈ పోరాట సమయంలో విమానం అకస్మాత్తుగా శరవేగంగా కిందకు జారడంతో కొందరు ప్రయాణికులు సీట్ల నుంచి గాల్లోకి ఎగిరిపడ్డారు. ఆ క్షణాలను తలచుకుంటే ఏదో హారర్ సినిమా చూసిన అనుభవం కలుగుతోందని జ్వీకా మానీస్ మీడియాతో తెలిపారు.
అదృష్టవశాత్తూ.. ఆ సమయంలో విధుల్లో లేని ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు వెంటనే స్పందించి విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.




